– లోకాయుక్తలో బీఆర్‌ఎస్‌వీ నేత గెల్లు ఫిర్యాదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23:కేజీబీవీ బంకర్ బెడ్స్ టెండర్లలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దీనిపై లోకాయుక్తలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభకోణం విషయంలో ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అడ్డుకట్టలేకుండా అవినీతి కొనసాగుతోందని విమర్శించారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ విద్యార్థులు చదువుకునే కేజీబీవీ పాఠశాలల్లో మౌలిక వసతుల పేరుతో ఈ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, నాసిరకం బంకర్ బెడ్స్ సరఫరా చేసి టెండర్లలో నియమ నిబంధనలను ఉల్లంఘించి ట్రూఫా, ముఫత్లాన్ కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.12 వేల ఒక బెడ్డును లోకల్ ఎంఎస్‌ఎంఈలకు లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో టెండర్‌లో భాగస్వామ్యం చేసారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అదే బెడ్డును రూ. 35 వేలకు మధ్యప్రదేశ్ నుంచి కొనుగోలు చేస్తూ ఒక్కో బొడ్డుపై రూ.22 వేలను ఎస్టీమేషన్ కాస్ట్ పెంచి కాంట్రాక్టర్‌కు లబ్ది చేకూర్చారని ఆరోపించారు. మొత్తం 45,360 బెడ్‌లకుగాను ఒక్కో బెడ్డుకు రూ.33,446 అందజేస్తున్నాని, దాదాపు రూ.164 కోట్లను ఢిల్లీలో రాహుల్ గాంధీకి చేరవేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కుంభకోణంపై వెంటనే సీబీఐతో న్యాయ విచారణ జరపాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



