సివిల్స్‌ లో ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ

– ర్యాంకులు సాధించిన ఇద్ద‌రు విద్యార్థులు
– ఐపీఎస్‌కు ఎంపిక‌య్యే అవ‌కాశం
– మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: దళిత వర్గాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా సివిల్స్‌లో ప‌లువురు ఎస్సీ విద్యార్థులు విజ‌యం సాధించ‌డం సాధ్యమయ్యాయని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష–2025 తుది ఫలితాల్లో తెలంగాణ ఎస్సీ  స్టడీ సర్కిల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎ. ఆశిష్ దేశవ్యాప్తంగా ఏఐఆర్‌–676 ర్యాంక్ సాధించగా, ములుగు జిల్లాకు చెందిన డి. ప్రవీణ్ కుమార్ ఏఐఆర్‌–793 ర్యాంక్ సాధించారు. వీరు ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్‌) పొందే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన 27మంది విద్యార్థులు అర్హత సాధించి ఆగస్టులో జరిగిన మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. అందులో 7 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించగా చివరకు ఇద్దరు తుది ఎంపిక సాధించడం గర్వకారణమని మంత్రి అన్నారు. ఇటీవల ప్రకటించిన తెలంగాణ గ్రూప్–I ఫలితాల్లో కూడా ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థులు దాదాపు 33 ర్యాంకులు సాధించడం సంస్థ శిక్షణ నాణ్యతకు నిదర్శనమని వివరించారు. దళిత వర్గాలైన ఎస్సీ/ఎ స్టీ, వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉన్నతస్థాయి శిక్షణ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన నిధులు, సదుపాయాలను సమయానికి అందిస్తూ అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి మంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలోని దళిత అట్టడుగు వర్గాల నుండి మరింతమంది యువత సివిల్ సర్వీసెస్ వంటి అత్యున్నత పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈసారి ఎంపికైన ఆశిష్, ప్రవీణ్ కుమార్‌లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించి వివిధ పోటీ పరీక్షల్లో అగ్రస్థానాలు సాధించేలా కృషి చేసిన  స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.నరసింహ రెడ్డి, సంస్థ సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వారి కృషి ఫలితంగా తెలంగాణలోని ఎస్సీ/ఎ స్టీ వ‌ర్గాలకు చెందిన పేద అభ్యర్థులు ఇప్పటివరకు 1000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్–2025లో ఎంపికైన విద్యార్థులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎస్‌సీడీడీ & అధ్యక్షుడు సబ్యసాచి ఘోష్,  కమిషనర్, ఎస్ సీడీడీ, టీజీసీఎస్‌సీ ఉపాధ్యక్షురాలు బి.విజయేంద్ర అభినందించారు.  1980లో స్థాపించిన ఈ సంస్థ ఇప్పటివరకు 450 మందికి పైగా సివిల్ సర్వెంట్లను తయారు చేసింది. అలాగే రాష్ట్రంలోని 12 జిల్లా స్టడీ సర్కిల్‌లలో టీజీపీఎస్‌సీ, , బ్యాంకింగ్, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడా శిక్షణ అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం : http://tsstudycircle.co.in/ సంప్రదించాలి.

———————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *