– ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
– గిరిజన సంక్షేమ శాఖతో కమిషన్ సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: గత ప్రభుత్వ హయాం నుంచి ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు ఎస్టీల సంక్షేమం కోసం ఆయా సంవత్సరాలలోనే ఖర్చు కాకుండా మిగిలిపోయాయని, ఆయా కేటాయించిన సంవత్సరాలలోనే ఖర్చు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఎస్టీ ఉద్యోగులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు సకాలంలో వచ్చేలా రోస్టర్ విధానాన్ని పటిష్టం చేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మొదటిసారి గిరిజన సంక్షేమ శాఖతో సమావేశం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మాసబ్ ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖ భవన్‌లో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో వెంకటయ్య ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రావడం సంతోషమని, ఇకమీదట ఈ వర్గాల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ఆశించిన విధంగా జరుగుతాయని అన్నారు. గురుకులాల విద్య, విద్యార్థి వసతులకు సంబంధించి ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి విద్యార్థుల డైట్, కాస్మెటిక్ చార్జీలు వెంటనే విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. టైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ దేశంలో అన్ని కార్పొరేషన్లూ కొంత నిర్వీర్యమైనాయని, ఈ విషయంలో ప్రభుత్వ సహకారం ఆయా కార్పొరేషన్లకు అవసరమని అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో చర్చించి ఇప్పటికే కొన్ని విధానపరమైన నిర్ణయాలను తీసుకోగలిగామన్నారు. ఇకపై ఎస్సీ ఎస్టీ కమీషన్ ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తామన్నారు. కమిషన్ సభ్యులు కుశ్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్ల శంకర్, రేణికుంట్ల ప్రవీణ్‌లు గిరిజన సంక్షేమ అధికారులను ఆయా విషయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కమిషన్‌కు గిరిజన సంక్షేమ కార్యదర్శి కమ్ కమిషనర్ డాక్టర్ వి. ఎస్.అలగు వర్షిణి గిరిజన సంక్షేమానికి సంబంధించిన డేటాను, విశేషాలను అందించారు. ఎస్టీ గురుకులం కార్యదర్శి సీతాలక్ష్మి, ఇతర గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు గిరిజన విద్య, ఇంజనీరింగ్, ట్రైకార్, జీసీసీ విషయమై వివరాలు అందించగా గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ సంచాలకుడు డాక్టర్ వి.సముజ్వల అతిథులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.





