– ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో విలీనమైన ఇతర బ్యాంకు ఉద్యోగులకు ప్రజయోజనాల కల్పనలో వ్యత్యాసం ఉందంటూ దాఖల్కెన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఎస్బీఐ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలను ఆ బ్యాంకులో విలీనమైన ఇతర బ్యాంకుల ఉద్యోగులకు కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)కి నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంది. ఎస్‌బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జ్కెపూర్, ఎస్‌బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ అఫ్ ట్రావెన్‌కోర్ బ్యాంకులు గతంలో విలీనమయ్యాయి. అయితే ఎస్‌బీఐ ఉద్యోగులతో సమానమైన ప్రయోజనాలను కల్పించలేదంటూ ఆ బ్యాంకు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో సింగిల్ జడ్జి కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్, పీటీఎం గోపాలకృష్ణ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జి.ఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. సీనియర్ అడ్వొకేట్ ప్రభాకర్ శ్రీపాద వాదిస్తూ విలీనమైన బ్యాంకు ఉద్యోగులపట్ల ఎస్‌బీఐ వివక్ష చూపుతోందని చెప్పారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. వేరే బ్యాంకుల నుంచి ఎస్‌బీఐలో విలీనమైన ఉద్యోగులు 35 వేల మంది ఉంటారన్నారు. ఈ వ్యవహారంపై ఎస్‌బీఐ సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకోవాలని, అందుకు విరుద్ధంగా చీఫ్ జనరల్ మేనేజర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎస్‌బీఐ తరఫు సీనియర్ అడ్వొకేట్ బి.ఎస్.ప్రసాద్ ప్రతివాదన చేస్తూ ఎస్‌బీఐ నిర్ణయం విధానపరమైనదని, కోర్టులు జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని సుప్రీం కోర్టు సైతం తీర్పు చెప్పిందన్నారు. బ్యాంకుల విలీనం 2017 ఏప్రిల్‌లో జరిగిందని, ఇతర బ్యాంకుల ఉద్యోగుల సర్వీసు రూల్స్‌కు లోబడి సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకుందని అన్నారు. విలీన సమయంలో షరతులను ఆమోదించాక ఇప్పడు ఎస్‌బీఐ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కావాలని కోరడానికి వీల్లేదన్నారు. విలీన బ్యాంకుల్లో పనిచేసే 70 వేల మంది ఉద్యోగులు, 25 వేల మందికిపైగా అధికారులు ఎస్‌బీఐ సర్వీసులో చేరారని, వీరిలో కొద్దిమంది మాత్రమే సమాన అవకాశాలు కల్పించాలని కోరుతున్నారని వివరించారు. ఆర్థిక కోణంలో సమస్యను చూడాలని, ఎస్‌బీఐపై ఆర్థిక భారం పడేలా ఉండకూదని వాదించారు. పిటిషన్లకు విచారణార్హతే లేదన్నారు. ఒకరు పదవీ విరమణ చేశారని, ఒకరిని సర్వీసు నుంచి తొలగించారని, ఫెడరేషన్ తరపున ప్రధాన కార్యదర్శికి బదులు ఉపాధ్యక్షుడు పిటిషన్ దాఖలు చేయడం చెల్లదని అన్నారు. వాదనల తర్వాత ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను సెప్టెంబరు 10వ తేదీకి వాయిదా వేసింది.





