క్షమాభిక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరిన కుటుంబం
స్పందించిన ఐఏఎస్ అధికారిణి దివ్య దేవరాజన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : సౌదీ అరేబియాలో ఇంటి డ్రైవర్ గా పనిచేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లికి చెందిన ఒక వలస కార్మికుడికి స్థానిక ఆచార వ్యవహాలు, చట్టాల పట్ల అవగాహన లేక మూడున్నర ఏళ్ల జైలు శిక్ష పడి రియాద్ జైల్లో మగ్గుతున్నాడు. ఫిబ్రవరి ఒకటిన జైలు పాలయిన బాలనర్సుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ద్వారా న్యాయ సహాయం అందించి, క్షమాభిక్ష ఇప్పించాలని అతడి భార్య నక్క దేవేంద్ర శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్ లోని ‘ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సెలవుపై సౌదీ నుంచి వొచ్చిన సామాజిక సేవకులు అసాని రాజిరెడ్డి, మహ్మద్ నవీద్ లతో కలిసి ఆమె సీఎం ప్రజావాణి ఇంచార్జి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవారాజన్ ను కలిసి గోడు వెళ్ళబోసుకున్నారు. ఇంటి డ్రైవర్ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా బాలనర్సు తన అరబ్ యజమాని పిల్లలను పాఠశాలకు తీసికెళ్లేవాడని, పిల్లలతో స్నేహపూర్వక ప్రవర్తను యజమాని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఆమె పేర్కొన్నారు. స్థానిక ఆచార వ్యవహారాలు, సున్నితత్వం తెలియకపోవడం వల్ల అపోహలకు దారితీసి జైలుపాలయ్యాడని ఆమె తెలిపారు. వెంటనే స్పందించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవారాజన్, రాష్ట్ర ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారి సిహెచ్. శివ లింగయ్యతో మాట్లాడారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ, సౌదీ అధికారుల వద్దకు క్షమాభిక్ష అభ్యర్థనను పంపడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


