మాజీ మంత్రి అయినా లైన్‌లో నిలబడాల్సిందే..

– గుండ్రాతిమడుగులో సత్యవతి రాథోడ్‌ యూరియా అవస్థలు

మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14: యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం రోజులతరబడి లైన్లలో నిలబడి అలసిసొలసిపోవాల్సిన పరిస్థితులు తప్పడంలేదు. జిల్లా ఎస్పీ సైతం రాత్రనకా పగలనకా సొసైటీల వద్ద కాపలాగా ఉండి ఎలాంటి ఘర్షణలు లేకుండా రైతులకు యూరియా అందేలా ఎందుకు శ్రమ పడాల్సి వస్తున్నదో ఆ దేవుడికీ అర్థం కాని పరిస్థితి. అధికారులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి యూరియా కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప‌రిస్థితి వేరేగా ఉంది. ఎన్ని ఎకరాల పొలం ఉన్న రైతుకైనా ఒకటే కట్ట యూరియా లభిస్తోంది. అదీ లైన్‌లో నిలబడితేనే. ఆఖరుకు బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన సత్యవతి రాథోడ్‌కు కూడా లైన్‌లో నిలబడి యూరియా తీసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొరివి మండలం గుండ్రాతిమడుగు సొసైటీ వద్ద యూరియా కట్ట కోసం సత్యవతి రాథోడ్‌ ఆదివారం చిన్నాచితకా, మోతుబరి రైతులతో క‌లిసి లైన్‌లో నిలబడితేనే యూరియా దొరికిందంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆమెకు సెక్యూరిటీగా ఉన్న పోలీసు కూడా లైన్‌ పక్కన వేచి ఉండాల్సి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో యూరియా కోసం రైతులు లైన్లో నిలబడే పరిస్థితి ఉండేది కాదు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మాత్రం యూరియా కొరత ఏర్ప‌డింది. పరిష్కరించే ప్రయత్నం కూడా చేయడంలేదని రైతులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంటకు సంబంధించి సకాలంలో యూరియా దొరకకపోవడంతో దిగుబడి పూర్తిగా రాకుండా పోయింది. వరికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుండడంతో ప్రభుత్వం మేల్కొని యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *