– 16 అంశాలపై వివరాల సేకరణ
– తాగునీటి సరఫరాపై సర్పంచ్‌ల సంతృప్తి
– ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలి
– అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయం నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల సర్పంచులతో నేరుగా అనుసంధానం చేపట్టి తాగునీటి సరఫరా వ్యవస్థపై సమగ్ర ఫీడ్‌బ్యాక్ సేకరణ నిర్వహించారు. పది రోజులుగా ఫోన్ ద్వారా సర్పంచులతో సంప్రదింపులు జరిపి మొత్తం 12,728 గ్రామ పంచాయతీలలో 12,457 మంది సర్పంచుల అభిప్రాయాలను సేకరించారు. తాగునీటి సరఫరా, నీటి నాణ్యత, ఓవర్ హెడ్ ట్యాంకుల క్లోరినేషన్, ట్యాంకుల శుభ్రత, పైపులైన్ లీకేజీలు, పంపుల పనితీరు, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు, టోల్ ఫ్రీ నెంబర్ 1916పై అవగాహన తదితర 16 కీలక అంశాలపై వివరాలు సేకరించారు. దీనిపై మంత్రి సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్పంచ్ ల అభిప్రాయ సేకరణ వివరాలను తెలుసుకున్నారు. ఈ అభిప్రాయ సేకరణలో అధిక శాతం సర్పంచ్‌లు తాగునీటి సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామస్థాయిలో సర్పంచ్‌ల అభిప్రాయమే ప్రభుత్వానికి అసలైన మార్గదర్శకం. వారి సూచనల ఆధారంగా మిషన్ భగీరథ సేవలను మరింత మెరుగుపరుస్తాం. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడం తమ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. సర్పంచ్‌లు గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మిషన్ భగీరథ అధికారులు గ్రామాలకు వెళ్లి పరిశీలించి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 1 నుండి 15 లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ వ్యవస్థ లేని మారుమూల గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకు ఓపెన్ వెల్స్ తవ్వించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల్లో భాగంగా వర్షాకాలానికి ముందే చెక్‌డ్యాంలు నిర్మించాలని సూచించారు. స్థానిక నీటి వనరులను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా నీటి లభ్యత పెరుగుతుందన్నారు. తాగునీటి సమస్యలపై ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్ 1916కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత వేసవిలో ఎలాంటి తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకున్నట్లే ఈ వేసవిలో కూడా మిషన్ భగీరథ ఇంజనీర్లు నిరంతర పర్యవేక్షణతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. సమస్యాత్మక గ్రామాలు, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడాలు, లంబాడీ తాండాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో తాగునీటి సరఫరాపై వచ్చే ప్రతి సమాచారంపై వెంటనే స్పందించి పరిష్కరించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




