మంత్రి పొంగులేటి స్వగ్రామంలో ఏకగ్రీవం

– కాంగ్రెస్‌ అభ్యర్థికే సర్వ సమ్మతి
– నారాయణపురం సర్పంచ్‌గా గొల్లమందల ఖరారు
– మంత్రి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి సమన్వయంతో ఏకాభిప్రాయం

కల్లూరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం పంచాయతీ సర్పంచ్‌ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మండల పరిధిలో మూడో విడతలో జరగాల్సిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు మాత్రమే నామినేషన్‌ దాఖలు చేయడంతో పోటీ లేకుండానే ఫలితం తేలిపోయింది. ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ చేసిన ఈ స్థానానికి గ్రామాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా గ్రామ పెద్దలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఒకే అభిప్రాయంతో ముందుకొచ్చారు. రాజకీయాలను పక్కనబెట్టి కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.

మంత్రి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి కృషి
ఈ ఏకగ్రీవ ఎన్నికలో మంత్రి సోదరుడు, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు పొంగులేటి ప్రసాద్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గ్రామంలోని అన్ని వర్గాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి అభిప్రాయ భేదాలను సర్ధుబాటు చేసి ఏకాభిప్రాయాన్ని సాధించారు. దీంతో పంచాయతీ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఏర్పడేందుకు మార్గం సుగమమైంది.

మంత్రి పొంగులేటి అభినందనలు
ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటేశ్వర్లుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రసాద్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపురం అభివృద్ధి పథంలో ఇది శుభ సూచికమని మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి స్వగ్రామం సర్పంచ్‌ పదవికి ఏకగ్రీవం కావడంతో స్థానిక ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *