చెక్ డ్యాంల విధ్వంసం వెనుక ఇసుక‌ మాఫియా

– ఇది అధికార‌ పార్టీ నేత‌ల పుణ్య‌మే
– విచ్చ‌ల‌విడి ఇసుక తవ్వ‌కాల‌ను నిలిపేయాలి
– న‌మోదైన కేసుల‌పై స‌త్వ‌ర విచార‌ణ జ‌ర‌పాలి
– నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ నివేదిక‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25:  మానేరు నదిపై నిర్మించిన రెండు చెక్ డ్యాం లను ఇసుక మాఫియా పేల్చి వేసిన సంఘటనలపై తెలంగాణా నిజనిర్ధారణ కమిటి రెండు చెక్ డ్యాం లను పరిశీలించి అక్కడ రైతులతో, ఇతర ప్రజలతో మాట్లాడి ఒక నివేదికను ఈనెల 23న విడుద‌ల చేసింది. ఇందులో పేర్కొన్న అంశాలీవిధంగా వున్నాయి. మానేరు నదిపై లోయర్ మానేరు డ్యాంకు దిగువన కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, తనుగుల గ్రామం వద్ద 23 కోట్ల ఖర్చుతో నిర్మించిన చెక్ డ్యాంను స్థానిక ఇసుక మాఫియా జిలెటిన్ స్టిక్స్ తో 21 నవంబర్ రాత్రి 10 గంటల ప్రాంతంలో పేల్చివేసినట్టు, దానిపై 22 నవంబర్ రోజున స్థానిక సాగునీటి శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీ పాలకుర్తి రవి  జమ్మికుంట ఎస్ హెచ్ ఓ కి ఫిర్యాదు చేసినట్టు తెలుగు, ఇంగ్లిష్ పత్రికలు ఫోటోలతో సహా ప్రచురించిన వార్తల నేప‌థ్యంలో తెలంగాణ నిజ నిర్ధార‌ణ క‌మిటీ ప్ర‌తినిధులు తనుగుల చెక్ డ్యాం వద్దకు డిసెంబ‌ర్ 5న  న వెళ్లి డ్యాం వద్ద వాస్తవ పరిస్థితులను ప్ర‌జ‌ల‌తో మాట్లాడి తెలుసుకున్నారు. చెక్ డ్యాం వరద లేని సమయంలో విధ్వంసం కావడం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ విధ్వంసం వెనుక పాలకపక్షానికి చెందిన ఇసుక మాఫియా ఉందని స్థానిక ప్రజలు తెలిపారు. ఉప కార్యనిర్వాహక ఇంజనీర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో కూడా న‌వంబ‌ర్ 21 రాత్రి 10 గంటల ప్రాంతంలో చెక్ డ్యాం వద్ద పెద్ద పేలుడు శబ్దం విన్నామని, ఆ తర్వాత వెళ్లి చూస్తే చెక్ డ్యాం ధ్వంసం అయినట్టు తనకు రైతులు చెప్పారని పేర్కొన్నారు. అప్పటి వరకు నీటితో నిండి ఉన్న చెక్ డ్యాం తెల్లవారేసరికి ఖాళీ అయిపోయిందని తనపై అధికారులకు రాసిన లేఖలో కార్యనిర్వాహక ఇంజనీరు పేర్కొన్నారు. మొత్తం 90 మీటర్ల చెక్ డ్యాం ధ్వంసం అయినట్టు ఎస్ ఈకి రాసిన లేఖ‌లో ఈఈ పేర్కొన్నారు.  ఈ పేలుడు వ‌ల్ల సుమారు 3.5 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు పేర్కొన్నారు. ఈ చెక్ డ్యాం ద్వారా తనుగుల, గుంపుల, శంభునిపల్లి గ్రామాల్లో 1000 ఎకరాలకు సాగు నీరు అందుతుంది.  చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో భూగ‌ర్భ‌జ‌లాల మ‌ట్టం పెరిగిందని రైతులు తెలిపారు. స్థానిక, జిల్లా కాంగ్రెస్ నాయకులు మాత్రం నాణ్యతా లోపం వలన చెక్ డ్యాం కొట్టుకుపోయిందని బుకాయిస్తున్నారని వారు తెలిపారు. స్థానిక ఎంపీ బండి సంజయ్ కూడా వీరికి వంత‌పాడ‌టం విచిత్ర‌మ‌ని రైతులు వాపోయారు. చెక్ డ్యాంను మేము ప్రత్యక్షంగా పరిశీలించినప్పుడు బాంబు పేలుడు వల్లనే ధ్వంసం అయ్యిందని స్పష్ట‌మైంద‌ని క‌మిటీ పేర్కొంది.  ఈ ఏడాది వానా కాలం అక్టోబర్-నవంబర్ నెలల్లో తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు లోయర్ మానేరు డ్యాం నుంచి గరిష్టంగా 66 వేల క్యూసెక్కులకు పైగా వరదను కింద మానేరు నదిలోకి వదిలినట్టు వరదల సమయంలో పత్రికల్లో వార్తలు వచ్చాయి. గత ఏడాది 60 వేల క్యూసెక్కుల వరదను నదిలోకి వదిలినట్లు రికార్డులు చెపుతున్నాయి. ఇంతటి ఉదృతమైన వరదలు ఉన్నప్పుడు చెక్ డ్యాంకు ఏమీ జరగలేదు. వరదలు లేనప్పుడు అంతకంటే ఎక్కువ విధ్వంసం కనబడుతున్నద‌ని క‌మిటీ స్ప‌ష్టం చేసింది. పేలుడు చెప్పుడుకు వేలాది చేపలు చనిపోయినట్టు స్తానికులు చెప్పారు. వీటన్నిటి దృష్ట్యా చెక్ డ్యాం పేలుడు వల్లనే జరిగిందని నిర్ధారణ అయ్యింది. చెక్ డ్యాం నీటి నిల్వ సామర్థ్యం సుమారు 5 మిలియన్ ఘనపు అడుగులు. ఈ నీరంతా కిందకు వెళ్ళిపోయి చెక్ డ్యాం ఖాళీ అవ‌డంతో ఈ యాసంగి పంట కాలానికి రైతులు ఇబ్బంది పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

అడవిసోమన్ పల్లి చెక్ డ్యాం విధ్వంసం
తనుగుల చెక్ డ్యాం పేలుడు ఘటన మరవక ముందే భూపాలపల్లి జిల్లా, మంథని మండలం, అడవిసోమన్ పల్లి వద్ద మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం డిసెంబ‌ర్ 17న ధ్వంస‌మైన‌ట్టు మ‌రునాడు ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఈ విధ్వంసానికి పాల్ప‌డి వుంటార‌ని, 120 మీటర్ల పొడవున చెక్ డ్యాం కూలిపోయిందని,12 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలబడిన ఈ చెక్ డ్యాం వరద లేని సమయంలో కూలిపోయిందని, ఈసంఘటనపై సమగ్ర విచారణ జరిపి చెక్ డ్యాం ను ద్వంసం చేసిన వారిని గుర్తించి చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కొయ్యూరు ఎస్ హెచ్ ఓ కి డిసెంబ‌ర్ 18న  న ఫిర్యాదు చేసినారు. పోలీసులు అదే రోజు ఎఫ్ ఐఆర్‌ నమోదు చేశారు. 20వ తేదీన నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ అడవిసోమన్ పల్లి చెక్ డ్యాం పరిశీలనకు వెళ్లింది. అదే రోజు హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సాంపుల్స్ తీసుకోవడానికి అధికారులు వ‌చ్చారు. వారు ఆ సైట్ నుంచి వెళ్ళేవరకు కమిటి సభ్యులను చెక్ డ్యాం వద్దకు వెళ్ళకుండా పోలీసులు నిరోధించినారు. ఎట్టకేలకు సాయంత్రం 6 గంటలకు చెక్ డ్యాం పరిశీలనకు అనుమతించారు. ఇక్కడ కూడా దృశ్యం తనుగుల వద్ద ఉన్నట్టే ఉన్నది. ఈ రెండు చెక్ డ్యాం ల విధ్వంసం వెనుక ఇసుక మాఫియా ఉందన్న అనుమానం కలుగుతున్నది. వీరికి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పెద్దల అండ ఉన్నట్టు కూడా ప్రజలు అనుమానపడుతున్నారు. ఇంజనీర్ల నివేదికల ప్రకారం 2021 లో తనుగుల, అడవిసోమన్ పల్లి చెక్ డ్యాం లు  నిర్మాణం ప్రారంభం అయి 2024 లో పూర్తి అయ్యింది. తనుగుల చెక్ డ్యాంను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్ర‌క్ష‌న్స్ లిమిటెడ్‌ వారు నిర్మించారు. బహుళ ప్రయోజనాలున్న చెక్ డ్యాంలను ఇసుక మాఫియా ఇట్లా పేల్చి వేయడం దుర్మార్గం. యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా శత్రు దేశాలు డ్యాంలపై, నీటి తావులపై దాడులు చేసిన సందర్భాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా కానరావంటూ, ఈ దుశ్చ‌ర్య‌ను క‌మిటీ తీవ్రంగా ఖండించింది.  ప్రజలు అప్రమత్తంగా ఉండడం వలన పెద్దపల్లి మండలం, మూలసాల గ్రామం వద్ద హుసేన్ మియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను ఇటువంటి  పేలుడు నుంచి రక్షించుకోగ‌లిగార‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో నీటి తావులను ఇసుక మాఫియా నుంచి రక్షించుకోవాలని రైతాంగానికి, ప్రజలకు క‌మిటీ విజ్ఞ‌ప్తి చేసింది. హుసేన్ మియా చెక్ డ్యాంపై దాడి జ‌రిగిన త‌ర్వాత 2024 జ‌న‌వ‌రి 16న  పెద్దపల్లి ఎస్ హెచ్ ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా ఎఫ్ ఐఆర్ న‌మోదైంది. అయితే ఏడాది గ‌డిచినా దీని ద‌ర్యాప్తు పూర్తికాలేదు. దోషుల‌కు శిక్ష‌ప‌డ‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని క‌మిటీ పేర్కొంది. డిసెంబ‌ర్ 22న వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసే అవార్డు గ్రహీత శ్రీ రాజేంద్ర సింగ్  కూడా విధ్వంసం అయిన తనుగుల, అడవిసోమన్ పల్లి చెక్ డ్యాం లను సందర్శించి విచారాన్ని వ్యక్తం చేసారు. జాతీయ జల్ బిరాదరి తరపున ఒక నిజనిర్ధారణ కమిటిని, విశ్రాంత సుప్రీం కోర్టు / హై కోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన పీపుల్స్ ఎంక్వ‌యిరీ క‌మిష‌న్‌ను త్వరలోనే  ఏర్పాటు చేయబోతున్నామని ఆయన ప్రకటించారు.
డ్యాంలు, చెరువులు, నీటి తావులు ప్రజల సంపద కాబట్టి సాగునీటి శాఖ ఇంజనీర్ లు చేసిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి దోషులకు చట్టం ప్రకారం కఠిన శిక్ష విధించడానికి చర్యలు తీసుకోవాలను జమ్మికుంట పోలీసులకు, కొయ్యూరు పోలీసులకు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ఎస్పి లకు క‌మిటీ విజ్ఞ‌ప్తి చేసింది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలను నిరోధించాలని పోలీసు శాఖను, మైనింగ్ శాఖను కోరింది. పరిమితికి మించి ఇసుక తవ్వకాల వల్ల కూడా చెక్ డ్యాంలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నది. కాబట్టి చెక్ డ్యాములలో అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిరోధించాలని కోరింది. మానేరున నదిలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డ్డుకట్ట వేయాలంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేసింది.పేలుడు ప‌దార్థాల వినియోగంపై గ‌ట్టి నియంత్ర‌ణ వుండాల‌ని కోరింది. చెక్ డ్యామ్‌ల విధ్వంసంపై న‌మోదైన కేసుల ద‌ర్యాప్తును వేగంగా పూర్తిచేసి దోషుల‌ను చ‌ట్టం ముందు నిల‌బెట్టాల‌ని డిమాండ్ చేసింది. తనుగుల, అడవిసోమన్ పల్లి  చెక్ డ్యాంలను వచ్చే వానాకాలం నాటికి పునరుద్దరించి వినియోగంలోకి తీసుకురావాలని సాగునీటి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. నాణ్యతా లోపమని చెప్పి ఇంజనీర్లను బలి పశువులను చేయవద్దని కూడా మంత్రికి విజ్ఞ‌ప్తి చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌పై సంత‌కాలు చేసిన‌ వారిలో వి ప్రకాష్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రొఫెస‌ర్‌ సీతారామారావు, అంబేద్కర్ ఓపెన్ వర్సిటి మాజీ ఉప కులపతి  ప్రొఫెస‌ర్‌ రాఘవరెడ్డి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఈఆర్ దామోదర్ రెడ్డి, సాగునీటి శాఖ విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈఆర్ శ్రీధర్ రావు దేశ్ పాండే, సీనియర్ జర్నలిస్ట్తె పిట్టల రవీందర్, జేఏసీ మాజీ రాష్ట్ర కోఆర్దినేటర్ ఎర్రోజు శ్రీనివాస్, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర కార్యదర్శి మల్లావజుల విజయానంద్,  ఉపాధ్యక్షుడు బుచ్చన్న, సీనియర్ జర్నలిస్టు శంకర్ ఉన్నారు.
————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *