ఇది ప్రజల గోప్యత ఉల్లంఘ‌నే ..

– ‘సంచార్‌ సాథీ’పై పార్లమెంట్‌లో మండిపడ్డ విపక్షం
– దీనిని వెంటనే తొలగించాలని డిమాండ్‌
– అసవరం లేకుంటే డిలీట్‌ చేసుకోవచ్చన్న మంత్రి సింధియా

న్యూదిల్లీ, డిసెంబర్‌ 2: సంచార్‌ సాథీ అంశంపై పార్లమెంట్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్‌, శివసేన, తదితర పార్టీలు దీనిని తీవ్రంగా విమర్శిస్తూ ఇది ప్రజల గోప్యత ఉల్లంఘనే అంటూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్ష కాంగ్రెస్‌ దీనివిూద వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టి సంచార్‌ సాథీపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్‌ చేసింది. సంచార్‌ సాథీ యాప్‌.. ఫోన్‌ యూజర్ల కదలికల్ని, మెసేజెస్‌, కాల్స్‌ను పర్యవేక్షిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ దీనిని ఇదొక డిస్టోపియన్‌ టూల్‌ అని.. ఇది ప్రతి భారతీయుడిని మానిటర్‌ చేయడమే కాక వారి ఆర్థిక హక్కులపై దాడిగా అభివర్ణించారు. దీని అమలు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎంపి రేణుక చౌదరి దీనిపై వాయిదా తీర్మానం దాఖలు చేశారు. మరో ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ఇది ఒక దారుణమైన పరిణామమని.. ఇది భవిష్యత్తులో నియంతృత్వానికి దారితీస్తుందని అన్నారు. ప్రజల గోప్యతను హరిస్తుందన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాగరిక ఘోష్‌ కూడా దీనిని తీవ్రంగా తప్పుబట్టారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో సంచార్‌ సాథీ యాప్‌పై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చర్చకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ అజెండా ప్రకారం సెషన్‌లో 14 బిల్లులపై ఫోకస్‌ పెడదామని సూచించారు. అటు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌ కూడా దీనిపై స్పందించింది. సంచార్‌ సాథీ కేవలం ప్రజల సైబర్‌ సెక్యూరిటీ కోసం ఉద్దేశించింది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన లేదని తెలిపింది. ఈ యాప్‌ యూజర్‌ డేటాని రక్షిస్తుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా కీలక ప్రకటన చేశారు. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు తమ మొబైల్‌ నుంచి సంచార్‌ సాథీ యాప్‌ను డిలీట్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఆ యాప్‌ తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. ఇండియాలో స్మార్ట్‌ఫోన్లు తయారు చేసే కంపెనీలకు ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్లలో కచ్చితంగా ప్రభుత్వ సంబంధిత సంచార్‌ సాథీ యాప్‌ను ప్రీ`ఇన్‌స్టాల్‌ చేసి ఉంచాలని ఆదేశించింది. యాప్‌ వల్ల గోపత్యకు భంగం కలిగే అవకాశాలున్నట్లు విమర్శకులు చెబుతున్నారు. దీనిపై సోమవారం రాత్రి పీఐబీ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఈ ఆదేశాల అమలుకు 90 రోజుల గడువు ఇచ్చిన కేంద్రం దానికి సంబంధించి 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్రం వెనక్కి తగ్గింది. ఇది తప్పనిసరి కాదని, అయితే మోసం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక యాప్‌ ఉందని అంద‌రికీ తెలియదు కాబట్టి ఆ సమాచారాన్ని వెల్లడించ‌డం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి జ్యోతిరాదిత్య చెప్పారు. ఫోన్‌ తయారీదారులకు ఆదేశాలు జారీ చేయడం వెనకగల కారణం ఇదేనన్న ఉద్దేశంలో సమాధానం ఇచ్చారు. అయితే దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నారని కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంకా గాంధీ దుయ్యబట్టారు. ఫోన్లపై నిఘానో, సంచార్‌ సాథీ యాప్‌ విషయమో కాదు.. అన్ని అంశాల్లో వారి వైఖరి అలాగే ఉందని విమర్శలు గుప్పించారు. ఇది పెగాసస్‌ ప్లస్‌ప్లస్‌. బిగ్‌ బ్రదర్‌ మన ఫోన్‌ను, మన ప్రైవేటు జీవితాన్ని స్వాధీనం చేసుకుంటాడని కాంగ్రెస్‌ నేత కార్తి చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే విపక్షాలు పార్లమెంట్‌ సమావేశాలకు అంతరాయం సృష్టించొద్దని, అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమని మంత్రి కిరణ్‌ రిజిజు ఆ విమర్శలను తోసిపుచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *