అమ్మల‌ కీర్తిని ప్ర‌పంచానికి చాటేలా జాత‌ర

– సంప్రదాయాలు దెబ్బ తినకుండా  భారీ ఏర్పాట్లు
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, జూలై 11: వొచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న  సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు.  ఆదివాసీ సంప్రదాయాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. శుక్రవారం ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవిచందర్ లతో కలిసి  సమ్మక్క సారలమ్మలను దర్శించుకోగా గిరిజన పూజారులు డోలు వాయిద్యాల మధ్య ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న ఘ‌న‌కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. వేల సంవత్సరాల పాటు నిలిచిపోయేలా సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామ‌న్నారు. ఇప్పటికే జాతరలో శాశ్వత పనులు జరుగుతుండగా మరో రూ.112 కోట్లతో సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పించామ‌ని చెప్పారు. మేడారం మహా జాతరను విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.  క్యూ లైన్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, జాతర విజయవంతానికి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. జంపన్న వాగుపై ఇరువైపులా భక్తులు సేద తీరడానికి అహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, పూజార్ల ఆలోచన విధానంతోనే ముందుకెళుతున్నామ‌ని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *