సిడ్నీ దాడి ఉగ్రవాది సాజిత్‌కు భారత పాస్‌పోర్టు

– హైదరాబాద్‌ ‌వాసిగా పేర్కొన్న పోలీసులు
– స్టూడెంట్‌ ‌వీసాపై వెళ్లి ఆస్ట్రేలియాలోనే నివాసం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఆ‌స్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బోండీ బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్‌ అ‌క్రమ్‌ (50) ‌వద్ద భారత పాస్‌పోర్ట్ ఉన్నట్లు  ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. అతడు హైదరాబాద్‌ ‌నుంచి పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ డీజీపీ కార్యాలయం దీనిపై ప్రకటన విడుదల చేసింది. సాజిద్‌ అ‌క్రమ్‌ ‌హైదరాబాద్‌ ‌వ్యక్తి అని వెల్లడించింది. ఇక్కడే బీకామ్‌ ‌చదివిన సాజిద్‌ 27 ఏళ్ల క్రితం 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. యూరోపియన్‌ ‌యువతి వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు నవీద్‌ అ‌క్రమ్‌, ‌కుమార్తె. వీరిద్దరూ ఆస్ట్రేలియా పౌరులే. సాజిద్‌ అ‌క్రమ్‌ ఇప్పటికీ భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నాడు. అయితే హైదరాబాద్‌లో అతడికి అతి తక్కువ సంబంధాలు ఉన్నాయని, ఆస్ట్రేలియాకు వలస వెళ్లాక సాజిద్‌ ఆరుసార్లు భారత్‌కు వచ్చాడని తెలిపింది. కుటుంబ, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల కోసమే ఇక్కడకు వచ్చాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఉగ్రవాదులతో సాజిద్‌కు సంబంధాలపై తమకే తెలియదని హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులు తెలిపారని డీజీపీ కార్యాలయం తమ ప్రకటనలో వెల్లడించింది. సిడ్నీలోని బోండీ బీచ్‌లో ఆదివారం యూదులు హనుక్కా ఉత్సవం చేసుకుంటుండగా ఈ ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. సాజిద్‌ అ‌క్రమ్‌, అతడి కుమారుడు 24 ఏళ్ల నవీద్‌ అ‌క్రమ్‌లు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సాజిద్‌ ‌హతమవ్వగా నవీద్‌ను అరెస్టు చేశారు. వీరికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అం‌డ్‌ ‌సిరియా(ఐసిస్‌)‌తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్‌లో ఈనెల‌ 14‌న జరిగిన ఉగ్రదాడిలో 15మంది మరణించగా, 40మందికి పైగా గాయపడ్డారు. యూదుల వేడుకలను లక్ష్యంగా చేసుకుని తండ్రీకొడుకులు సాజిద్‌ అ‌క్రమ్‌ (50), ‌నవీద్‌ అ‌క్రమ్‌ (24) ‌కాల్పులు జరిపారు. దాడికి ముందు వీరిద్ద‌రూ నవంబర్‌లో ఫిలిప్పీన్స్‌కు వెళ్లి వచ్చారు. అక్కడ ఐఎస్‌ఐఎస్‌-‌సంబంధిత ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్నారనే అనుమానాలున్నాయి. వారి వాహనంలో ఇంప్రూవైజ్డ్ఎక్స్‌ప్లోసివ్‌ ‌డివైస్‌లు,హోమ్‌మేడ్‌ ఐఎస్‌ఐఎస్‌ ‌జెండాలు లభ్యమయ్యాయి. దాడి ఐఎస్‌ఐఎస్‌ ‌భావజాలం ప్రేరేపితమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ ‌ప్రకటించారు. ఈ ఘటనపై భారత నిఘా సంస్థలు సాజిద్‌ ‌కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నాయి. విషయం తెలిసిన హైదరాబాద్‌లోని అతడి బంధువులు షాక్‌కు గురయ్యారు. దర్యాప్తు కొనసాగుతోంది. తండ్రి చనిపోయిన సమయంలో భారత్‌కు సాజిద్‌ ‌రాలేదని పోలీసులు చెప్తున్నారు. ఇత‌ను ఐఎస్‌ఐఎస్‌ ఉ‌గ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలియదని పోలీసులు చెప్పారు. సాజిద్‌, నవీద్‌ ఉ‌గ్రవాదం వైపు వెళ్ళడానికి స్థానిక ప్రభావం లేదని గుర్తించారు. 1998లో సాజిద్‌పై దేశంలో ఎలాంటి కేసులు లేవని పోలీసులు అంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *