ఆత్మహత్యకు యత్నించిన సాయిఈశ్వర్ మృతి

– బీసీ సంఘాల ఆందోళన, అరెస్టు
– గాంధీ దవాఖానలో ఉద్రిక్తత

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కో రుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సాయి ఈశ్వర్ చారి (35) గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి 17 శాతమే ఇవ్వడంపై చర్చించేందుకు గురువారం సాయిఈశ్వర్ తీన్మార్ మల్లన్న ఆఫీస్ కు వెళ్లాడు. అక్కడ అనూహ్యంగా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించి న స్థానికులు వెంటనే మంటలు ఆర్పేసి హాస్పిట‌ల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్ర‌వారం మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్ప గించారు. సాయి ఈశ్వర్ కు భార్య కవిత (30), ముగ్గురు పిల్లలు కృత్తిక(6), సాయి దత్త(4), చిట్టి (1) ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పోచారం గ్రామానికి చెందిన సాయిఈశ్వర్ బతుకుతెరువు కోసం నగరానికి వచ్చి తల్లి ప్రమీల. భార్యాపిల్లలతో జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

గాంధీలో బీసీ సంఘాల ఆందోళన, అరెస్ట్

సాయి ఈశ్వర్ చారి మృతి వార్త తెలుసుకున్న బీసీ సంఘాల‌ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కుల సంఘాల
జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారితోపాటు వివిధ బీసీ సంఘాల వందలాదిమంది నాయకులు పెద్ద ఎత్తున గాంధీ హాస్పిట‌ల్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈశ్వర్ మృతికి కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలే కారణం అంటూ నిందించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్, తీన్మార్ మల్లన్న, కుందారం గణేష్ చారి, బీసీ సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి చిలకలగూడ, తిరుమలగిరి, బొల్లారం, అంబర్ పేట, ఉప్పల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్, తీన్మార్ మల్లన్న, కుందారం గణేష్ చారి మాట్లాడుతూ సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో అన్యాయం చేసినందుకే అత‌ను ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్యగానే భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలే ఈ హత్యకు బాధ్యత వహిం చాలన్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని పాలించారు. సాయి ఈశ్వర్ మృతితో అయినా కేంద్రం, రాష్ట్రం దిగి రావాలన్నారు. పార్లమెంట్ లో చర్చ జరగాలన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లో నే ఆమోదించాలన్నారు. తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిలిపివేసి, రిజర్వేషన్ తర్వాతే నిర్వహించాలన్నారు. బీసీ ద్రోహుల పార్టీలైన కాంగ్రెస్, బిజెపిల నాయకుల ఇండ్లను ముట్టడిస్తామాన్నారు. కాంగ్రెస్ బిజెపిలలో ఉన్న బీసీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. సాయి ఈశ్వర్ చారి మృతిపై అఖిలపక్ష పార్టీల వైఖరి ప్రకటించాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *