– బీసీ రిజర్వేషన్లతో మోసం వల్లే ఆత్మహత్య
– అతని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
– బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: సాయిఈశ్వర్ అనే యువకుడి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్‌ఎస్ ఆరోపించింది. బీసీ రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన దారుణమైన మోసానికి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడవడాన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మాహుతి చేసుకున్నాడని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేవలం 17 శాతానికే కుదించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని కేటీఆర్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాయి ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కులగణనను మొదలుకుని న్యాయస్థానాల్లో నిలబడని జీవోల దాకా కాంగ్రెస్ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్‌కు సమాధి కట్టిందని కేటీఆర్ అన్నారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో తమ్ముడు సాయి ఈశ్వర్ బలైపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదని తెలిపారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అధికార దాహానికి బలైన ప్రాణం ఇది అని పేర్కొన్నారు. సాయి ఈశ్వర్ ఆత్మకు శాంతి కూరాలని ఆ దేవుడిని హరీశ్‌రావు ప్రార్థించారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని బీఆర్‌ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని సాయి ఈశ్వర్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నను కలవడానికి వెళ్లిన సాయిఈశ్వర్ గురువారం సాయంత్రం ఆయన ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న వారు మంటలను ఆర్పివేసి సాయిఈశ్వర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయిఈశ్వర్ ప్రాణాలు కోల్పోయాడు.
సాయి కుటంబానికి మాజీ మంత్రుల పరామర్శ
సాయి ఈశ్వర్ మరణించడంపై మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతకుముందు వీరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సాయిఈశ్వర్‌ను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సాయిఈశ్వర్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. అయితే చికిత్స పొందుతూ మరణించాడు. అనంతరం మాజీ మంత్రులు మీడియాతో మాట్లాడుతూ సాయి ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ మిమ్మల్ని ఎవరు అడిగారని ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వొచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ మోసం చేసిందని అన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు నిర్మల్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. నల్లగొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్తను మంత్రి కోమటిరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసి మూత్రం తాగించారని పేర్కొన్నారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలు ఏకమై ఈ ప్రభుత్వాన్ని గ్దదె దింపుతామని హెచ్చరించారు. బీసీ బిడ్డలు ఆవేశాలకు గురై బలవన్మరణాలకు పాల్పడవొద్దని కోరారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





