– నేరాల సమీక్షలో పోలీస్ అధికారులతో డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎంపిక చేసిన జిల్లాల్లో సేఫ్ విలేజ్ ప్రోగ్రాంలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి వెల్లడిరచారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో నేరాల స్థితిగతులను సమీక్షించారు. ముఖ్యంగా తీవ్రమైన నేరాలు, ఆర్థిక నేరాలు, బాలలకు సంబంధించిన నేరాలపై లోతుగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టేందుకు ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల పరిధిలో ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రాం’పై విస్తృత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాలను చేపట్టి, ఫలితాలనుబట్టి మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తామన్నారు. అంతేకాక పొరుగు రాష్ట్రాల సరిహద్దులుగా కలిగిన జిల్లాల ఎస్పీలు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకుని అంతర్రాష్ట్ర నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సీఐడీ విభాగంలో నేర విశ్లేషణ, సాంకేతికత కోసం క్రైమ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎనాలసిస్ పేరుతో ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవినీతికి పాల్పడే సిబ్బందిపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, మెదక్ జిల్లాలోని టేక్మాల్ (టెక్మాల్)లో జరిగిన సంఘటన పునరావృతం కారాదని అధికారులను మరోసారి గట్టిగా హెచ్చరించారు. కింది స్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడితే వారిని పర్యవేక్షించడంలో విఫలమైన ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం.భగవత్, సీఐడీ అడిషనల్ డీజీపీి చారు సిన్హా, మల్టీజోన్ -2 అడిషనల్ డీజీపీ డి.ఎస్.చౌహన్, మల్టీ జోన్ బి1 ఐజిపి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐజీపీలు డాక్టర్ ఎం.రమేష్, కె.రమేష్ నాయుడు, ఎస్పీలు నవీన్ కుమార్, వెంకటలక్ష్మి, సతీష్, లీగల్ అడ్వైజర్ అజయ్ కుమార్, తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



