హృదయ పేటికలోని

దుఃఖం

ఏ ఊట బుగ్గ నుండి

స్రవిస్తోంది?

ఏ రహస్య క్షేత్రంలోంచి

జనిస్తోంది?

ఆశ నిరాశలకి అతీతమై

కారణరహితమై

ఈ దుఃఖం

చోటులో

అంతటా

పరివ్యాప్తమై ఉందా?

ఆనందానికి

అవిభాజ్యమై

దుఃఖం

ఎందుకలా జ్యాలలా

రగులుతోంది

నిత్యాగ్నిహోత్రమై వెలుగుతోంది

దావానలమై గమిస్తోంది

క్రూరమైన దయతో

ఆశల్ని కాల్చి

ప్రేమల్ని తుంచి

రుధిర ధారలై ప్రవహించి

రక్తాశ్రువులను చిందింపజేసి

అగ్నిశిలాద్రవ ప్రవాహంవలె

తన దారిలోని సర్వాన్ని

లోనికి లయం చేసుకుంటూ

మృత్యు శీతల క్షేత్రంలోకి

గుహ్య నిశీధి కుహరంలోకి

నిరంతర నిర్నిద్రలోకి

లుప్తమై

ఆ మహా శూన్య బిలంలోకి జారి

అదృశ్యమవుతోంది

ఎందుకు?

శ్రీరామ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *