విద్యార్థుల త్యాగాల‌తోనే తెలంగాణ‌

– యువ‌త గురించి గ‌త ప్ర‌భుత్వం ఆలోచించ‌లేదు
– 14 ఏళ్ల‌పాటు గ్రూప్‌-1 నియామ‌కాలు లేవు
– 731 ఉద్యోగాల‌కు 5ల‌క్ష‌ల‌మంది ద‌ర‌ఖాస్తులు
– చిత్త‌శుద్ధి వున్న‌వాళ్ల‌నే టీజీపీఎస్సీలో నియ‌మించాం
– నాణ్య‌మైన విద్య‌పై దృష్టి
– ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
– 1370 మందికి నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేత‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16: పుట్టిన బిడ్డ ప్ర‌యోజ‌కుడు అయితే త‌ల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. కూలీ ప‌ని చేసి మ‌రీ త‌ల్లిదండ్రులు చ‌ద‌వించి పోటీ ప‌రీక్ష‌ల‌కు త‌యారు చేశారు. ఉస్మానియా, కాక‌తీయ యూనివ‌ర్సిటీల్లో విద్యార్థులు ఉద్య‌మ‌కారుల‌య్యారు. విద్యార్థులు అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ప్రాణ‌త్యాగాలు చేసి తెలంగాణ‌ను సాధించారని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శిల్పా కళా వేదికలో శుక్ర‌వారంకొలువుల పండుగ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా 1370 మంది గ్రూప్-3 విజేతలకు నియామక పత్రాలు అందజేసారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ప‌దేళ్ల‌లో రెండుసార్లు సీఎం అయిన వ్య‌క్తులు రాజ‌కీయ‌, కుటుంబ‌, పార్టీ ప్ర‌యోజనాల కోస‌మే ప‌నిచేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ పైన ఆలోచ‌న చేయ‌లేదు. కుటుంబం మొద‌టి ప్రాధాన్య‌త‌, పార్టీ రెండో ప్రాధాన్య‌త‌, రాజ‌కీయాలు మూడో ప్రాధాన్య‌త‌గా ఆలోచించారు. తెలంగాణ యువ‌త గురించి ఆలోచించ‌లేదు. వాళ్ల ఉద్యోగాలు తొల‌గిస్తేనే మాకు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని నిరుద్యోగ యువ‌త న‌డుం బిగించారు కాబ‌ట్టే ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. టీజీపీఎస్సీ లో దారుణ ప‌రిస్థితులు అంద‌రికి తెలుసు. 14 యేళ్ల పాటు గ్రూప్ వ‌న్ నియామ‌కాలు చేప‌ట్ట‌లేక‌పోయారు. ఇంతకంటే దారుణం, ఘోరం ఎక్క‌డైనా ఉంటుందా? 563 గ్రూప్ వ‌న్ ఉద్యోగాల కోసం 5 ల‌క్ష‌ల మంది అప్లికేష‌న్లు పెట్టుకున్నారు. 731 గ్రూప్-2 ఉద్యోగాల కోసం కూడా 5 లక్ష‌ల మంది అప్లై చేశారని తెలిపారు.

టీజీపీఎస్సీ ని ప్ర‌క్షాళ‌న చేశాం

గ‌త ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేదు. ప్ర‌శ్నా ప‌త్రాల‌ను ప‌ల్లీ బ‌ఠానీల్లా అమ్మితే వారికి చీమ‌కుట్టిన‌ట్లైనా లేదు. టీజీపీఎస్సీ ని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేశాం. యూపీఎస్సీ ని స్వ‌యంగా ప‌రిశీలించి టీజీపీఎస్సీ ని ఏర్పాటు చేశాం. ఆర్ఎంపీ డాక్ట‌ర్, డిప్యూటీ ఎమ్మార్వో, రిటైర్డ్ టీచ‌ర్ ను టీజీపీఎస్సీ స‌భ్యులు గా గ‌త ప్ర‌భుత్వం నియ‌మించింది. తెలంగాణ నిరుద్యోగుల ప‌ట్ల గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది. తెలంగాణ ప‌ట్ల చిత్త‌శుద్ది ఉన్న‌వాళ్లేనే టీజీపీఎస్సీ స‌భ్యులు గా నియ‌మించాం. ప్ర‌భుత్వ టీచ‌ర్లు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాల‌ను ఒక బాధ్య‌త‌తో ఎలాంటి త‌ప్పులు లేకుండా భ‌ర్తీ చేశాం. నియామ‌క‌ప‌త్రాలు ఇవ్వొద్ద‌ని కుట్ర‌లు చేసినా కోర్టుల ముందు కొట్లాడి భ‌ర్తీ చేశాం.రెండేళ్ల‌లో దాదాపు 70 వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేశాం. ఎల్బీ స్టేడియం, శిల్పారామం, సాగునీటి పారుదల శాఖ కార్యాల‌యం, అంబేద్క‌ర్ విగ్ర‌హం సాక్షి గా నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశాం. భ‌విష్య‌త్తు త‌రాల‌కు మీ ఉద్యోగాలు దిక్సూచి గా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగం అంటే ఒక భావోద్వేగం. తెలంగాణ రాష్ట్ర పున‌ర్ నిర్మాణంలో మీమ్మ‌ల్ని భాగ‌స్వాములు చేస్తోంది.. 25 ప్ర‌భుత్వ‌ శాఖ‌ల్లో 1370 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్నాం. ఉద్యోగ నియామ‌కాల‌తో మమ్మ‌ల్నీ క‌లిసి మీ క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌నే ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేశాం. మాజీ ప్ర‌ధాని నెహ్రు విద్య‌, నీటిపారుద‌ల రంగానికి ప్రాధాన్య‌త ఇచ్చారు.దేశంలో హ‌ర‌త విప్ల‌వాన్ని తీసుకువ‌చ్చి అహార భ‌ద్ర‌త క‌ల్పించింది మాజీ ప్ర‌ధాని నెహ్రు.. విద్య అంద‌రికి అందుబాటులో ఉన్న‌ప్ప‌టికి నాణ్య‌మైన విద్య ప్ర‌జ‌ల‌కు అంద‌డం లేదు. 16 ల‌క్ష‌ల మంది విద్యార్థులు మాత్ర‌మే ప్ర‌భుత్వ పాఠ‌శాల్లో చ‌దువుతున్నారు. 11 వేల ప్రైవేట్ స్కూల్స్ లో 33 ల‌క్ష‌ల విద్యార్థులు చ‌దువుతున్నారు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌పైన ఎందుకు విశ్వాసం త‌గ్గుతుందో ఆలోచించాలి. పేద‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందిస్తే ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌గ‌ల‌మనే విశ్వానం నాకుంది.

క్వాలిటీ ఎడ్యూకేష‌న్, క్వాలిటీ పుడ్, స్కిల్ పైన దృష్టి 

దేశంలోనే అత్య‌ధికంగా వ‌రి పండించే రాష్ట్రం గా తెలంగాణ నిల‌బ‌డింది. 2.85 కోట్ల‌ మెట్రిక్ టన్నుల వ‌రిని పండించి దేశానికి ఆద‌ర్శంగా నిల‌బ‌డ్డాం. క్వాలిటీ ఎడ్యూకేష‌న్, క్వాలిటీ పుడ్, స్కిల్ పైన దృష్టి పెడుతున్నాం.. స్కిల్ లేక‌పోవ‌డంతో అంత‌ర్జాతీయ స్థాయిలో పోటీ ప‌డ‌లేక‌పోతున్నాం.విద్య‌లో స్కిల్ చాలా ముఖ్య‌మైన‌ది.. స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కోసం ప‌నిచేయాల్సి ఉంది. నాణ్య‌మైన విద్య‌ను అందించే అవ‌కాశం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉంది. విద్య ఒక్క‌టే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకువ‌స్తుంది. ప్ర‌భుత్వానికి వార‌ధులు, సార‌ధులు ప్ర‌భుత్వ ఉద్యోగులే. 2047 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీ గా తెలంగాణ ను తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నాం. గ‌రం,న‌రం, బేష‌ర‌మ్ నానుడి త‌ప్పు అని ఉద్యోగులు నిరూపించాలి. పేద‌ల మోహంలో త‌ల్లిదండ్రుల‌ను చూసుకుని ప్ర‌భుత్వ ఉద్యోగులు సేవలు ల‌క్ష్యంగా అందించాలి. త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వం గా చూసుకొని ఉద్యోగుల‌ జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి త‌ల్లిదండ్రుల‌కు అంద‌జేస్తాం. త‌ల్లిదండ్రుల‌ను స‌రిగా చూసుకోని వాళ్లు మాన‌వ జ‌న్మ‌లో ఉండొద్దు. త‌ల్లిదండ్రుల‌ను బాగా చూసుకోవాలి. రాజ‌కీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారొద్దు. ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో, అశోక్ న‌గ‌ర్ చౌర‌స్తాలో నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సలహాదారులు షబ్బీర్ అలీ,హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ,రాజ్య సభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంఎల్ ఏ లు ఆరెకపూడి గాంధీ,కాలే యాదయ్య,ఎంఎల్సీ బల్మూర్ వెంకట్ ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *