– ఇరు దేశాల మధ్య మరింత వాణిజ్య సహకారం
– అమెరికా ఆంక్షలు ఉన్నా చమురు రవాణా ఆగదు
– అణు విద్యుత్ తదితర రంగాల్లో సహకారం కొనసాగిస్తాం
– ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలసి నడుస్తాం
– ఉక్రెయిన్‌తో యుద్ధ్దంపై మోదీ సూచనలు స్వాగతిస్తున్నాం
– మోదీతో భేటీలో సంయుక్త మీడియా సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్
న్యూదిల్లీ, డిసెంబర్ 5: టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్‌తో కలిసి నడుస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. టెర్రరిజాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు భారత్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. శుక్రవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, పుతిన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చింది. అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. విభిన్న అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్-రష్యా మధ్య రూ.64 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇరుదేశాల మధ్య ట్రేడ్ మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయిల్ సహా అన్ని రంగాల్లో సహకారం అందిస్తాం. ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక అంశాల్లో పరస్పర సహకారం ఉంటుంది. సొంత కరెన్సీల్లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం జరుగుతోంది. కొడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుకు సహకరిస్తాం. విద్యుత్ రంగంలో ఖర్చు తగ్గింపునకు సాయం అందిస్తాం. భారత్‌తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్‌కు నిరంతరంగా ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపడుతుందని అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. వొచ్చే ఏడాది భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపడుతుందన్నారు. భారత్‌కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామన్నారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్దాన్ని ఆపటానికి ప్రధాని మోదీ ఎంతో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. యుద్ధం ఆపే ప్లాన్ గురించి తనకు వివరించి చెప్పారని అన్నారు. అమెరికా లాంటి దేశాల నుంచి వాణిజ్య ఒత్తిడులు ఎదురైతున్నప్పటికీ .. భారత్- రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడుల కారణంగా కొంతకాలంగా చమురు దిగుమతులను భారత్ తగ్గించినప్పటికీ.. ఆ దేశాభివృద్ధికి సహకరించడం కోసం సరఫరాను పెంచేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. గతేడాది భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 12 శాతం పెరిగి.. రికార్డు సృష్టించిందని రష్యా అధ్యక్షుడు అన్నారు. ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో పెరుగుదల ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ సహకరాన్ని కూడా మరింత విస్తరిస్తామని తెలిపారు. రష్యా దృష్టి పెట్టాల్సిన కీలక సవాళ్ల గురించి మోదీ తనతో చర్చించారని.. భారత్- యురేషియా ఆర్థిక సంఘం మధ్య స్వేచ్ఛా వాణిజ్య మండలాన్ని సృష్టించడం వంటి వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. అంతే కాకుండా భారత్-రష్యా క్రమంగా చెల్లింపుల కోసం తమ జాతీయ కరెన్సీలను ఉపయోగించే దిశగా కదులు తున్నాయని.. దాదాపు 96 శాతం వాణిజ్య చెల్లింపులు జాతీయ కరెన్సీలలోనే జరుగుతున్నాయన్నారు. మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరుకు భారత్- రష్యా కలిసి నడుస్తాయన్నారు. ఇటీవల పహల్గాంలో జరిగిన దాడికి, గతేడాది రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లో జరిగిన దాడికి మూల కారణం ఉగ్రవాదమేనని అన్నారు. మానవత్వ విలువలపై చేస్తున్న ఈ ప్రత్యక్ష దాడులకు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై పోరుకు ఇరుదేశాలు ఏకమైనట్లు తెలిపారు. భారత్, రష్యా, యూఎన్, జీ20, బ్రిక్స్ వేదికలు సన్నిహిత సహకారాన్ని కలిగి ఉన్నాయని.. ఈ వేదికలన్నింటిలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని కొనసాగిస్తామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





