– మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు
– అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు
– సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారని, ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 9న రాఖీ పండుగ రోజున 45.62 లక్షల మంది మహిళలు ప్రయాణించగా ఈ నెల 11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారని పేర్కొన్నారు. ఒక్క రోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేసిందని, ఈ ఏడాది 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించారన్నారు. గతేడాదితో పోలిస్తే 92.95 లక్షల మంది ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని, ఈ ఏడాది 2.28 కోట్ల కి.మీ ఆర్టీసీ బస్సులు తిరిగాయన్నారు. రాఖీ పౌర్ణమికి మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుని ఉచితంగా రాకపోకలు సాగించడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హర్షం వ్యక్తం చేశారు. సంస్థ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని రాఖీ పండగకు రికార్డుస్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ పండుగను త్యాగం చేసి భారీ వర్షాల్లోనూ నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారంటూ ప్రశంసించారు. రద్దీలోనూ మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేశారన్నారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది నిబద్దతతో పనిచేయడం వల్లే రాఖీ పండుగకు లక్షలాదిమంది ప్రయాణికులను సిబ్బంది గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చారని సజ్జనర్ తెలిపారు. ఈ రాఖీ పండుగ ఆపరేషన్స్ సంస్థలో సరికొత్త రికార్డులను నమోదు చేసిందని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థపై ప్రజల ఆదరాభిమానాలు ఎంతలా ఉన్నాయో చెప్పేందుకు ఈ రికార్డులే నిదర్శనమని చెప్పారు.




