– సీఎం కప్-2025 నిర్వహణలో అందరినీ భాగస్వాముల్ని చేస్తాం
– పండుగ వాతావరణంలా క్రీడాజ్యోతి ర్యాలీలు
– క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
– జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారులతో సమీక్షా సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: గ్రామీణ క్రీడాకారుల ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా సీఎం కప్I2025 నిర్వహిస్తామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆయన జిల్లా యువజన క్రీడ అభివృద్ధి అధికారులు, క్రీడా శాఖ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కప్-2024 మాదిరిగానే సీఎం కప్-2025 కూడా గ్రామీణ స్థాయి నుంచి నిర్వహిస్తామని, గ్రామీణ యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అందులో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. సీఎం కప్-2025 నిర్వహణ మొక్కుబడిగా నిర్వహించకుండా అందరు ప్రజాప్రతినిధులను, అధికారులను ఇందులో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. ఇందులో ఎలాంటి పార్టీ భేదాలు లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా స్వయంగా మాట్లాడి లేఖలు రాసి వారి సహాయాన్ని కోరుతామని, జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో పరిపాలనాపరంగా క్రీడా శాఖలో కొన్ని ఇబ్బందులున్నా సీఎం కప్ నిర్వహణకు చిత్తశుద్ధితో ఉత్సాహంతో కృషి చేస్తున్న అధికారులను ఆయన అభినందించారు. సీఎం కప్ పోటీలను కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం చేయకుండా ప్రతి ఉమ్మడి జిల్లాల్లో ఆయా జిల్లాల్లో ప్రాచుర్యం ఉన్న క్రీడాంశాలలో పోటీలను ఒక పండుగ వాతావరణం తెచ్చేలా నిర్వహిస్తామని తెలిపారు. కేవలం పోటీలు నిర్వహించడమే కాక ప్రతి క్రీడాకారుడి సమాచారాన్ని నిక్షిప్తం చేసి ప్రతిభ కలిగిన వారిని గుర్తించి ప్రోత్సహించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం కప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు భవిష్యత్తు క్రీడా అవకాశాల్లో మంచి స్థానం ఇస్తామని, సీఎం కప్ సర్టిఫికెట్లకు ప్రభుత్వం కల్పించే విద్య, ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యత దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ సీఎం కప్ నిర్వహణ, దాని ఆశయాన్ని గ్రామీణ స్థాయిలో విస్తృత ప్రచారం చేసేందుకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడాజ్యోతి కార్యక్రమాలు నిర్వహించి అందులో క్రీడాకారులు, క్రీడాభిమానులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని డీవైిఎస్‌ఓలను కోరారు. గ్రామీణస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు జరిగే ఈ పోటీలలో అన్ని స్థాయిల్లో విజయవంతం చేసిన ఐదు జిల్లాలను ఎంపిక చేసి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారి పట్ల కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. క్రీడల సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కప్ నిర్వాహణలో క్రీడా సంఘాలను భాగస్వామ్యం చేయాలని, సూచించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి, డిప్యూటీ డైరెక్టర్లు, స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు, కోచ్‌లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





