– 43 శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్ సర్వీసులు
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి 11: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి పండుగ ఉండటంతో 14 నుంచి 16 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 స్పెషల్ సర్వీసులు నడవనున్నాయి. అదేవిధంగా కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీటితోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది. శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్ టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. మూడు రోజులు నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15 నుంచి 17 తేదీ వరకు (మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుంది.
శివరాత్రి ఆపరేషన్స్‌పై ఉన్నతాధికారులతో సంస్థ వీసీ, ఎండీ శ్రీ వై నాగిరెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. శివరాత్రి పండుగకు శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. గత శివరాత్రి కంటే ఈసారి 208 బస్సులను అదనంగా సంస్థ నడుపుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేసింది. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో (ప్లలె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో) రాష్ట్ర ప్రభుత్వ జీ.ఓ. ప్రకారం.. మహిళలకు యథావిథిగా ఉచిత రవాణా సదుపాయం అమల్లో ఉంటుంది. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని, టికెట్ల బుకింగ్ ను వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని, మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-234500332లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




