ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు

తక్షణమే చెల్లించి విద్యార్థులను ఆదుకోండి..
సిఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌లేఖ

తక్షణమే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ‌బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు- కళాశాలలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్‌ ‌కళాశాలలు మూతపడ్డాయి. కొన్ని కాలేజీలు ఫీజులు చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ‌బకాయిలు చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు బండి సంజయ్‌ ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రభుత్వమే విస్మరించిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 8,000 కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని  పేర్కొన్నారు.

బండి సంజయ్‌ ‌పేర్కొన్న వివరాల ప్రకారం, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ‌బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్‌ ‌కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అధ్యాపకులకు జీతాలు, సిబ్బందికి భత్యాలు, కాలేజీల నిర్వహణ ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉన్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్‌ ‌కళాశాలలు మూతపడటం ప్రారంభించాయని బండి సంజయ్‌ ‌హెచ్చరించారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించనిదే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల మధ్య వాగ్వాదాలు తీవ్రమై పోలీస్‌ ‌స్టేషన్ల దాకా కేసులు వెళుతున్నాయని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఫీజు బకాయిలను వన్‌ ‌టైం సెటిల్‌ ‌మెంట్‌ ‌చేయాలని ఒకసారి, మరోసారి 12 వాయిదాల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ మాటలను విస్మరించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *