– శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోదీ
– కామాఖ్య-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
గువాహటి, మార్చి1 3: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. షెడ్యూల్ ప్రకారం కోకరాఝార్‌లోని బహిరంగ సభలో మోదీ ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ వాతావరణ ప్రతికూలత కారణంగా వేదిక వద్దకు చేరుకోలేకపోయారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అస్సాం అభివృద్ధికి రూ.4,500 కోట్లతో పలు పనులు ప్రారంభించామని, ఇందులో రూ.1,100 కోట్లు బోడోలాండ్ ప్రాంతంలోని రోడ్ల కోసం ఖర్చు చేయనున్నామని చెప్పారు. అస్సాం మేళా ఇనీషియేటివ్ మూడో దశలో అస్సాంలో రోడ్ల అనుసంధానం మరింత పటిష్టమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా కామాఖ్య-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, గౌహతి-న్యూ జల్‌పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్‌లను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ బోడోలాండ్‌ను తప్పుడు హామీలతో దశాబ్దాలుగా వంచించిందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బోడోలాండ్ ప్రాంత ప్రజల కలలు సాకారమయ్యాయని అన్నారు. అటు కేంద్రంలో, ఇటు అస్సాంలో కాంగ్రెస్‌కు ప్రజలు ఉద్వాసన చెప్పి బీజేపీ-ఎన్డీయేకు అవకాశం ఇవ్వడంతో చిత్తశుద్ధితో తాము అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. కాంగ్రెస్ వివిధ గ్రూపుల మధ్య అసంతృప్తిని పెంచితే, శాంతి కోసం బీజేపీ పాటుపడిందని, బోడో పీస్ ఒప్పందంపై సంతకం చేసి అన్ని ప్రధాన సంస్థలు, గ్రూపులను ఏకతాటిపైకి తెచ్చిందని చెప్పారు. అస్సాంలో చొరబాటుదారులను కాంగ్రెస్ ప్రోత్సహించిందని, గిరిజనుల భూములను అక్రమంగా చొరబాటుదారులకు కట్టబెట్టిందని మోదీ విమర్శించారు. అయితే గిరిజనుల భూములు వారికే తిరిగి ఇప్పించేందుకు ముఖ్యమంత్రి శర్మ అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. దీనికి ముందు, అస్సాంలో రెండ్రోజుల పర్యటన కోసం గౌహతి వచ్చిన మోదీకి రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


