– అక్రమంగా నిధులు సమీకరించినట్లు ఆరోపణలు
– కస్టడీకి అల్ ఫలాహ్ వర్సిటీ గ్రూపు చైర్మన్ సిద్దిఖి
- విచారణలో పలు కీలక ఆధారాల సేకరణ
న్యూదిల్లీ, నవంబర్ 19: అల్ ఫలాహ్ గ్రూపు చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖికు విరాళాల రూపంలో రూ.415 కోట్లు అందినట్లు ఈడీ పేర్కొన్నది. తన ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి అక్రమ రీతిలో ఆ నిధులను సకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గల్ఫ్‌లో ఫ్యామిలీ సభ్యులు స్థిరపడడం వల్ల అక్కడికి పారిపోయే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. ఫరీదాబాద్‌లో రోజంతా జరిగిన తనిఖీల తర్వాత అల్ ఫలాహ్ వర్సిటీ గ్రూపు చైర్మన్ సిద్దిక్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 10న జరిగిన ఎర్రకోట కారు పేలుడు ఘటనతో వర్సిటీకి లింకు ఉన్న కారణంగా ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. 13 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఆయన్ను అప్పగించారు. తప్పుడు అక్రెడిటేషన్, గుర్తింపు చూపిస్తూ విద్యార్థులు, పేరెంట్స్ నుంచి ఆ వర్సిటీ భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆ రూపంలోనే రూ.415 కోట్లు సేకరించినట్లు తెలుస్తున్నది. పరారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అతన్ని కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ఈడీ పేర్కొన్నది. 1990 నుంచి అల్ ఫలాహ్ వర్సిటీ అంచలంచెలుగా ఎదిగిందని, ఇప్పుడు ఓ పెద్ద విద్యాసంస్థగా మారినట్లు తెలిపింది. అల్-ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఈడీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఫీజుల రూపంలో వొచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపినట్లు గుర్తించామన్నారు. ఎటువంటి గుర్తింపు లేకుండానే విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తూ ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన కార్యాలయంతోపాటు సంస్థ ట్రస్టీల ప్రాంగణంలో దాడుల అనంతరం మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు విశ్వవిద్యాలయం ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. సోదాల్లో రూ.48 లక్షలకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంటరీ ఆధారాలు లభ్యమైనట్లు తెలిపారు. 2014-15 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల వరకు ఉన్న విశ్వవిద్యాలయ ఆదాయ పన్ను రిటర్నులలో ఫీజుల రూపంలో వొచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపిస్తున్నట్లు గుర్తించారు. అక్రమంగా సంపాదిస్తున్న ఈ నిధులను ఎక్కడికి మళ్లిస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటీవల ఫరీదాబాద్‌లో ఉగ్ర మాడ్యూల్‌ను అధికారులు చేధించిన సంగతి తెలిసిందే. మాడ్యూల్‌లోని వ్యక్తులకు ఈ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో దీని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మాడ్యూల్‌తో సంబంధాలు బయటపడిన తర్వాత ఇండియన్ యూనివర్సిటీల సంఘం అల్-ఫలా విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈక్రమంలో దిల్లీ పోలీసులు యూనివర్సిటీలపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఫోర్జరీ, మోసం పేరిట ఇవి నమోదయ్యాయి. మరోవైపు.. విశ్వవిద్యాలయానికి న్యాక్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. విద్యాసంస్థ వెబ్‌సైట్‌లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకు గానూ ఇవి జారీ చేసినట్లు తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





