– సర్పంచ్‌లకు పండగ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జవవరి 13: సంక్రాంతి పండుగ రోజు గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ. 277 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ అధికారులు సోమవారం పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను వెంటనే విడుదల చేశారు. సోమవారం ప్రజాభవన్ లో ఆర్థిక శాఖ అధికారుల ముఖ్యసమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ సర్పంచ్ లకు, వార్డు మెంబర్లకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం, డిప్యూటీ సీఎంకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు
పంచాయతీలకు రూ.277 కోట్లు విడుదల కావడం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. కొత్త సర్పంచులు, వార్డు సభ్యులకు ఇది ఒక గొప్ప ప్రోత్సాహకరమైన సంకేతమన్నారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు వంటి అత్యవసర అవసరాలను వేగంగా తీర్చేందుకు ఈ నిధులు దోహదపడతాయని తెలిపారు. గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. పంచాయతీలకు నిధులు అందేలా చొరవ చూపిన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులను ప్రజా ప్రయోజనాలకు, గ్రామాభివృద్ధికి పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగించాలని సర్పంచులు, వార్డు సభ్యులకు సూచించారు. వారికి సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





