– సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం
– మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించేందుకు ఈనెల 22న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ సమావేశానికి మహిళా ఉద్యోగులను ఆహ్వానిస్తున్నామని, ఈ సమావేశంలో వచ్చే అభిప్రాయాలనుబట్టి మహిళల కోసం నూతన పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. మహిళా ఐక్యతను దెబ్బతీయడానికి కొందరు తప్పుడు ప్రచారం చేస్తారని, ఉచిత బస్సు ప్రయాణం మీద తప్పుడు ప్రచారం చేశారని, అది పురుషహంకారానికి, భూస్వామ్య భావజాలానికి నిదర్శనమని అన్నారు. సచివాలయం మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం మొదటి సర్వసభ్య సమావేశం, లోగో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీతక్క, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు ఐక్యత సాధిస్తే అన్నీ సాధించినట్లేనన్నారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయన్నారు. పెట్రోల్ బంకుల ఏర్పాటు ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పారు. మహిళా ఉద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎలాంటి సమస్యలున్నా నేరుగా తమతో చెప్పుకోవచ్చునని సీతక్క హామీ ఇచ్చారు. ప్రభుత్వ గౌరవాన్ని కాపాడే విధంగా మహిళా ఉద్యోగులు పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. ఉమెన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు హాజరయ్యారు. మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులుగా ఎన్నికైన వారిచే మంత్రి సీతక్క ప్రమాణస్వీకారం చేయించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





