హన్మకొండ, ప్రజాతంత్ర : కాకతీయ ప్రభుత్వ కళాశాల ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పాలకుర్తి దినకర్‌కు హనుమకొండ రోటరీ క్లబ్ (Rotary Club Hanamkonda) ప్రతినిధులు నేషన్ బిల్డర్ అవార్డు (Nation Builder Award 2025) ను ప్రదానం చేశారు. వాగ్దేవి కళాశాలలో ఆదివారంగురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉన్నత విద్యా రంగంలో బోధన, పరిశోధన, పాఠ్యపుస్తకాల రచనా రంగాల్లో చేసిన విశిష్ట సేవల గాను దినకర్ ను ఈ అవార్డుకు ఎంపిక చేశామని రోటరీ క్లబ్ హన్మకొండ అధ్యక్షులు బేతి రవీందర్ రెడ్డి, కార్యదర్శి నరేష్ తెలిపారు.
డాక్టర్ దినకర్ (Dr Palakurti Dinakar) ఎంఏ ఇంగ్లీష్‌లో గోల్డ్ మెడల్, ఎంఫిల్ లో ఫస్ట్ ర్యాంక్, బెంగళూరులోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ లో దక్షిణ భారతదేశంలోనే మొదటి ర్యాంకును సాధించారు. దినకర్ గతంలో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు, పీవీ నరసింహారావు మెమోరియల్ అవార్డు, ఇంటిగ్లోబల్ స్పెషల్ అవార్డు వంటి 15 కు పైగా అవార్డులు అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ కోర్సు పుస్తక రచయితగా మాత్రమే కాకుండా, మరో 20 కి పైగా పుస్తకాలను దినకర్ రచించారు. 11 ఇంటర్నేషనల్ 42 నేషనల్ సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు. వీరి 76 పరిశోధన పత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 100కు పైగా కవితలు 60 కి పైగా కథలు మూడు నవలికలను తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. కాగా దినకర్‌కు అవార్డు రావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రజినీలత, డాక్టర్ ఇందిరా దేవి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనాథ్, స్టాఫ్ సెక్రటరీ మాదారపు రవికుమార్, పలువురు అధ్యాపకులు తమ అభినందనలు తెలిపారు.





