గ్రామ అభివృద్ధిలో సర్పంచ్‌ పాత్ర కీలకం

– బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలి
– గ్రామ పంచాయతీల నిర్వహణకు రూ.500 కోట్లు మంజూరు
– మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకంగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు ఆరఅండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి, గోవిందరావుపేట మండలాల నూతన సర్పంచ్‌లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ది చెందాలంటే సర్పంచుల పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. నూతన సర్పంచులకు పంచాయతీరాజ్ చట్టంపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని, పాలకులుగా ఉంటూ సేవకులుగా ప్రజలకు సేవ చేయాలని సూచించారు. గ్రామాలలో మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా చూడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులకు అందరికీ ఉపయోగపడే పనులకు ఖర్చు చేయాలని,గ్రామ అభివృద్ధిపై పాలకమండలి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించాలని, ఉపాధి హామీ పథకంలో కార్మికుల సంఖ్య పెంచేలా చూడాలని తెలిపారు. సుమారు రూ.500 కోట్లను గ్రామ పంచాయతీలకు అందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి అనే అంశాలపై ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించనున్నట్లు, సర్పంచులకు మరిన్ని అదనపు బాధ్యతలు కల్పించి బాల్యవివాహాల నిరోధం, గ్రామాలలోని అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తించడం, మహిళా సంఘాలను ప్రోత్సహించడం, అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. శిక్షణ తరగతులకు విచ్చేసిన సర్పంచులకు పంచాయతీరాజ్ చట్టం గూర్చి, సర్పంచుల విధులుI బాధ్యతలపై ఐదు రోజులపాటు స్పష్టమైన అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా పంచాయతీ అధికారి, ఆత్మ కమిటీ చైర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, ఆరఅండ్‌బి గెస్ట్‌హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ తయారీ, తడి, పొడి చెత్త నిర్వహణ స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. అనంతరం ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన 75మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *