– దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలోకి తీసుకురండి
– రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ‘రేర’పై దృష్టి సారించండి
– ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్న క్రమంలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సచివాలయంలో మొదట హోంశాఖ తదుపరి మంత్రి దుదిళ్ల్ల శ్రీధర్‌బాబుతో కలిసి పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు వస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కీలకం అన్నారు. ఈ అంశంలో ఏ చిన్న పొరపాటుకు కూడా హోంశాఖ అధికారులు, సిబ్బంది అవకాశం ఇవ్వరాదని, ప్రతి కదలిక మీ కనుసన్నల్లో ఉండాలని సూచించారు. విధుల నిర్వహణ క్రమంలో హోం శాఖకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ నగరం ప్రపంచంలో మేటి నగరంగా ఎదుగుతున్న క్రమంలో వేగంగా పలు సంస్కరణలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా పోలీస్ శాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచాలని సూచించారు. అదేవిధంగా నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర గణనీయంగా ఉంటుందని, రాష్ట్రంలో సీసీ కెమెరాల వినియోగాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టాలని, అవసరమైనచోట మరమ్మతులు చేపట్టాలని, చిన్న కదలికను సైతం వెను వెంటనే గుర్తించి నిఘాను పటిష్టం చేయాలని, అందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. 2047 త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా లక్ష్య సాధనలో పబ్లిక్, ప్రైవేట్ మోడల్ అనివార్యమని, ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని పరిశ్రమల శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ‘క్యూర’, ‘ప్యూర’తోపాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ‘రేర’కు సమ ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం సూచించారు. ‘రేర’ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజా ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. తద్వారా రాష్ట్ర నలుమూలలోని యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధితోపాటు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉన్న రంగం ఎంఎసఎంఈ అని చెప్పారు. 41 జీసీసీలతో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఇదే వేగాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వ నుంచి ప్రోత్సాహం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. డాటా సెంటర్లలో ఏఐ వినియోగాన్నిపెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్, టీజీఐఐసీసీ వీణ శశాంక, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





