– దేశ ప్రజలందరికీ బీజేపీ క్షమాపణలు చెప్పాలి
– రోహిత్ వేముల కేసులో ఎవరినీ వదిలిపెట్టం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
దిల్లీ, ప్రజాతంత్ర, జులై 11: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల చావుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా వారికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు అందించిన బీజేపీ దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. దిల్లీలోనీ ఏఐసిసి కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో ఏఐసీసీ ఎస్‌సీ విభాగం చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్‌తో కలిసి శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రోహిత్ రాసిన సూసైడ్ నోట్‌లోగాని, యూనివర్సిటీ అధికారులకు విన్నవించిన విషయాలు గానీ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. హెచ్‌సీయూలో అడ్మిషన్స్ తీసుకునే దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్ తోపాటు ఇంత విషం. ఒక తాడును కూడా ఇస్తే ఉరి వేసుకోవడానికి పనికొస్తుంది అని యూనివర్సిటీ వీసీకి రోహిత్ రాసిన సూసైడ్ నోట్ ఈ దేశ ప్రజల మనసులను కలచివేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. అనేక కష్టనష్టాలకోర్చి పీహెచ్‌డీ స్థాయికి వచ్చిన నవ యువకుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడంటే యూనివర్సిటీలో ఎలాంటి పరిస్థితులు ఉన్న్డాయో అర్థమవుతోంది అన్నారు. యూనివర్సిటీలో ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన హక్కులు కల్పించండి అంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనివర్సిటీలో జరుగుతున్న ఘటనలపై విసీకి వినతి పత్రాన్ని ఇచ్చారని, దీన్ని జీర్ణించుకోలేని యూనివర్సిటీ ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ రోహిత్ వేములతోపాటు మరో నలుగురు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులను కావాలని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వీసీకి ఫిర్యాదు చేశారని, బీజేపీ నాయకత్వానికి కూడా వివరించారని ఆరోపించారు. వేములతోపాటు మరో నలుగురిపై పోలీసు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ వీసీపై ఒత్తిడి తేవడమేకాక పైనుంచి హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ నుంచి వీసీపై ఒత్తిడి తెచ్చాంని, స్థానికంగా ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యులపై పోలీసు కేసులు నమోదు చేశారని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక యూనివర్సిటీ అధికారులు రోహిత్‌తోపాటు మరో నలుగురిని రెస్ట్ గేట్ చేయడంతో మరో మార్గం లేక రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని డిప్యూటీ సీఎం తెలిపారు. అతని ఆత్మహత్య జరిగిన రోజు సభ్య సమాజం తలదించుకుందని, యావత్ భారత ప్రజలు బీజేపీ నాయకత్వాన్ని తప్పుపట్టారని తెలిపారు. ఈ సంఘటనపై స్పందించిన రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి అన్ని వివరాలు తెలుసుకొని, అన్ని విద్యార్థి సంఘాలతో పాటు రోహిత్ వేముల తల్లితో మాట్లాడారని వివరించారు. వేముల ఆత్మహత్య వంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాన్ని తెస్తామని, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు దేశంలో సమాన హక్కులు ఉండాలని కోరుకునే వారికి రక్షణ కల్పిస్తామని ఆరోజు రాహుల్ గాంధీ ఆయా వర్గాల్లో ఓ నమ్మకాన్ని, భరోసాను కల్పించారని భట్టి వివరించారు. ఆనాడు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించిన నాటి ఎమ్మెల్సీ రామచంద్రరావును ఇటీవల బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమించారని, అలాగే సుశీల్‌కుమార్‌ను దిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారని తెలిపారు. బీజేపీ పాలనపై మొదటినుంచి దళితులు, గిరిజనులు భయపడుతున్నట్టుగానే రోహిత్ వేముల మరణానికి కారణమైన వారికి పదోన్నతులు ఇచ్చి ఆ పార్టీ నిజం చేసిందని ఆరోపించారు. భారత రాజ్యాంగం ఈ దేశంలో పుట్టిన దళితులు, గిరిజనులకు బతకడానికి అవసరమైన అన్ని హక్కులు కల్పించిందంటూ అందరినీ బతకనివ్వండి అని డిప్యూటీ సీఎం కోరారు. రోహిత్ వేముల చట్టాన్ని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తెస్తుందంటూ రోహిత్ కేసును రీఓపెన్ చేయాలని కోరుతూ కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చిందని, ఆ కేసును రీఓపెన్ చేసి రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని ఎవరినీ వదిలిపెట్టం అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం ఇచ్చారు.





