– వర్షాలకు ధ్వంసమైన రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి ఆరా
– టిమ్స్, మెడికల్ కాలేజీలు, ఐడీఏఓసీల పనుల పురోగతిపైనా సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: వర్షాలు తగ్గుముఖం పట్టగానే ధ్వంసమైన రోడ్లకు పూర్తిస్థాయి, తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, శాశ్వత పునరుద్ధరణ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆర్ అండ్‌బి ఈఎన్సీ మోహన్ నాయక్‌ను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల పాడైన ఆర్‌అండ్‌బీ రోడ్ల వివరాలపై, పలు పనుల పురోగతిపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. 1062 ప్రాంతాల్లో,1370 కి.మీ స్టేట్ రోడ్స్ దెబ్బతిన్నాయని, 68 రోడ్లు కోతకు గురికాగా 38 తాత్కాలికంగా పునరుద్ధరించినట్టు ఈఎన్సీ మోహన్ నాయక్ వివరించారు. ఓవర్ ఫ్లో ఉన్న 520 రోడ్లకుగాను 478చోట్ల తగ్గుముఖం పట్టాయని, 445 చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే 375చోట్ల పునరుద్ధరించినట్టు తెలిపారు. సుమారు 306 చోట్ల సిడి వర్క్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణ కోసం అంచనాలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.72.49 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.1263.33 కోట్లు అవుతాయని అధికారులు వివరించారు. టిమ్స్ హాస్పిటల్స్,మెడికల్ కాలేజీలు, ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ల పనుల పురోగతి గురించి మంత్రి తెలుసుకున్నారు. టిమ్స్, మెడికల్ కాలేజీల పనులు వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తుది దశకు చేరుకున్న ములుగు, వరంగల్, కరీంనగర్ జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు రేయింబవళ్ళు కష్టపడాలన్నారు. నారాయణపేట,ఆ దిలాబాద్ కలెక్టరేట్ల పనుల్లో వేగం పెంచాలని, ఆర్‌అండ్‌బి పరిధిలో నిర్మాణమవుతున్న ప్రతి భవనం పనులు ప్రభుత్వం విధించిన గడువులోగా పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు. నేషనల్ హైవేలు, పురోగతిలో ఉన్న ఫ్లై ఓవర్లపై ఆరా తీసిన మంత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. ఎన్నికల కోడ్ తర్వాత పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహిస్తానని, ముఖ్యమంత్రితో మాట్లాడి హ్యామ్ రోడ్లపై ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి అధికారులతో అన్నారు. సమావేశంలో సీఈలు రాజేశ్వర్ రెడ్డి, బి.వి రావు, లక్ష్మణ్, ఎం.శ్రీనివాస్ రెడ్డి, కిషన్‌రావులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





