– 49 కిమీ సింగిల్ రోడ్లు డబుల్‌గా
– రూ.130 కోట్లకు ప్రభుత్వ ఆమోదం
సూర్యాపేట,ప్రజాతంత్ర, మార్చి 6: హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ లైన్‌గా ఉన్న సుమారు 49 కిలోమీటర్ల రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడానికి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ప్లాన్ (ఎండీఆర్) కింద రూ.130 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషితో ఈ రహదారి పనులకు ప్రభుత్వ ఆమోదం లభించింది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రూ.62 కోట్లతో 26.50 కి.మీ మేర డబుల్ రోడ్లు నిర్మించనున్నారు. దీంతో సుమారు 15 గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభం కానున్నాయి. కోదాడ నియోజకవర్గంలో రూ.68 కోట్లతో 22.60 కి.మీ మేర డబుల్ రోడ్లు నిర్మించేందుకు పాలనాపరమైన అనుమతులు లభించాయి. దీంతో అక్కడి 9 గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో చింతలపాలెం–కిస్టాపురం మధ్య 9.20 కి.మీ రహదారిని రూ.32 కోట్లతో డబుల్ రోడుగా అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా రామలక్ష్మిపురం నుంచి హుజూర్‌నగర్ బైపాస్ వరకు 3.80 కి.మీ, అమరవరం నుంచి కొత్త తండ వరకు 5.50 కి.మీ, గుడుగుంట్లపాలెం నుంచి ఎల్లాపురం వరకు 8 కి.మీ రహదారులను డబుల్ రోడ్లుగా మార్చనున్నారు. కోదాడ నియోజకవర్గంలో కోదాడ–అనంతగిరి మధ్య 6.60 కి.మీ రహదారిని రూ.30 కోట్లతో విస్తరించనున్నారు. అలాగే ఎన్‌హెచ్-9 నుంచి నేలమర్రి వరకు 10 కి.మీ రహదారిని రూ.24 కోట్లతో, కాపుగల్లు నుంచి దోరకుంట వరకు 6 కి.మీ రహదారిని రూ.14 కోట్లతో డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులు పూర్తయిన తరువాత రెండు నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి. వెంటనే టెండర్లు పిలిచి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





