Ham roads: రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం

– రోడ్ల అభివృద్ధిలో నూతన శకం ‘హామ్‌’
– పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
– ప్రాజెక్టు విజన్‌ను ఆవిష్కరించిన మంత్రులు కోమటిరెడ్డి, భట్టి, సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: రహదారులు బాగుంటేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, పరిశ్రమలు, పెట్టుబడులు(industries, investments)  ఆకర్షితమవుతాయని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు సులభంగా చేరుతాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క(Minister Sitakka)  అన్నారు. హెచ్‌ఐసీసీ నాక్‌ ఆడిటోరియంలో హామ్‌ (HAM) ప్రాజెక్టు రహదారులపై కీలక సమావేశం మంగళవారం జరగగా ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దనసరి అనసూయ సీతక్కలు హాజరయ్యారు. మంత్రులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించి హామ్‌ ప్రాజెక్టు విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌ శాఖల్లో ఒక్కో శాఖలో 17 ప్యాకేజీల చొప్పున మొదటి విడతలో 13,730 కి.మీ మేర రహదారులను నిర్మించనున్నట్లు తెలుపుతూ ఈ ప్యాకేజీకి సంబంధించిన సమగ్ర వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. డాక్యుమెంట్‌ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణలో రహదారి అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు హామ్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖలు సంయుక్తంగా ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్తాయని పేర్కొన్నారు. వేగంగా, నాణ్యమైన రహదారులు నిర్మించేందుకు హామ్‌ విధానాన్ని అవలంబిస్తున్నామని, పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ఈ విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని వెల్లడిరచారు. హామ్‌ విధానంలో రహదారుల నిర్మాణ ఖర్చులో 40 శాతం ప్రభుత్వమే భరిస్తుందని, మిగిలినది కాంట్రాక్టర్లు సమీకరించుకోవాలని సీతక్క వివరించారు. ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి అదనపు భారం లేకుండా తక్కువ సమయంలోనే వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించబోతున్నామని తెలిపారు. నిర్మాణం పూర్తయ్యాక పదిహేనేళ్లపాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లే చేపడతారని వెల్లడిరచారు. రాష్ట్రంలో రాజధాని నుంచి చివరి గ్రామం వరకు ఆధునిక రహదారులు వేయడం లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. మారుమూల గూడెంలు, తండాలు, పల్లెలకు రహదారి వ్యవస్థను బలోపేతం చేసేందుకు హామ్‌ ప్రాజెక్టుతో శ్రీకారం చుట్టామని, దేశానికి ఆదర్శవంతమైన రహదారి వ్యవస్థను నిర్మించాలన్నదే సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రజా ప్రభుత్వ సంకల్పమని సీతక్క అన్నారు.

మెరుగైన ర‌హ‌దారి సౌక‌ర్యం క‌ల్పించ‌డ‌మే ధ్యేయం

మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న యంగ్‌ స్టేట్‌ తెలంగాణ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందులో భాగంగానే హైబ్రిడ్‌ యాన్యుటి మోడ్‌(హ్యామ్‌) రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి గ్రామాన్ని మండల కేంద్రానికి, ప్రతి మండలాన్ని జిల్లా కేంద్రానికి, ప్రతి జిల్లాను రాష్ట్ర రాజధానికి కలిపే విధంగా రోడ్ల నిర్మాణం ఉంటుందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సహకారంతో పెద్ద ఎత్తున మంచి రోడ్లు వేసుకోబోతున్నామని, సంక్షేమంతోపాటు అభివృద్ధి కూడా అవసరమే కాబట్టి రోడ్లకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు.

‘రైజింగ్‌’లో కాంట్రాక్టర్లు భాగస్వాములు కావాల

తెలంగాణ రైజింగ్‌లో కాంట్రాక్టర్లు భాగస్వాములు కావాలని, హామ్‌ రోడ్డు పనుల్లో చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని యావత్‌ కేబినెట్‌ కట్టుబడి ఉందన్నారు. రహదారులు అభివృద్ధి జరిగితే మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కడికైనా ఉత్పత్తి అయిన వస్తువులను సునాయాసంగా తరలించవచ్చన్నారు. రహదారుల నిర్మాణంతో పరిశ్రమలు పెరిగి తద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి, ఆదాయం సమకూరుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు తెలంగాణ రైజింగ్‌లో భాగంగా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలను ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 17 ప్యాకేజీల ద్వారా రాష్ట్రంలో 7,947 కి.మీ మేర, రోడ్లు భవనాల శాఖ పరిధిలో 17 ప్యాకేజీల ద్వారా 5,190 మేరకు రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కేబినెట్‌ ఆమోదించిన రోడ్డు పనులకు త్వరితగతిన టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, కాంట్రాక్టర్లకు ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు బ్యాంకర్లతోనూ సమావేశం ఏర్పాటు చేసినట్టు భట్టి తెలిపారు. కాంట్రాక్టర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన ఉందని, గత ప్రభుత్వ పెద్దలు రూ.1.75 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ఒప్పందాలు చేసుకొని రూ.45 వేల కోట్ల విలువైన పనులకు టోకెన్లు జారీ చేసి ఆ బకాయిలు చెల్లించకుండా తమకు వారసత్వంగా ఆర్థిక భారాన్ని మిగిల్చి వెళ్లారని తెలిపారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ప్రభుత్వ సెక్రటరీలు దృష్టి పెట్టి పనిచేయడంతో క్రమంగా ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయన్నారు. కాంట్రాక్టర్ల ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఇంకా కొన్ని రోడ్లను ఫోర్‌ లైన్‌ రోడ్లుగా మార్చాల్సి ఉందని, త్వరగా ఆ జాబితా రూపొందించి కేబినెట్లో పెట్టి ఆమోదం పొందాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్రెడ్డి రామిరెడ్డి, చీఫ్‌ సెక్రటరీ కె.రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌, ఈఎన్సీలు, సీఈలు, ఇంజనీర్లు, బ్యాంకర్లు, కాంట్రాక్టర్లు, వర్క్‌ ఏజెన్సీలు పాల్గొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *