– ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత ఫోర్స్ వలంటీర్స్‌ను ఏర్పాటు చేయాలి
– నెలాఖరులోపు రోడ్ సేఫ్టీ కమిటీల సమావేశం జరపాలి
– విద్యార్థులు, డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలి
– కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరిలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యాచరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తిలతో కలిసి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ఏడాది రాష్ట్రంలో 25,934 రోడ్డు ప్రమాదాలు జరగగా 7949 మరణాలు జరిగాయని, ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి డ్రైవర్ నిరక్ష్యం, అతివేగం వల్లే జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి జిల్లాలో ఏర్పడిన రోడ్ సేఫ్టీ కమిటీలతో ఈ నెలాఖరులోపు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇందులో రవాణా, ఆర్టీసీ, విద్యా శాఖ, పోలీస్, ట్రాఫిక్, ఇతర విభాగాల అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలో రోడ్డు భద్రతా ఫోర్స్ వలంటీర్ బృందాలను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో అధికారులతో కలిసి ఈ టీం అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ బృందాలకు జనవరి 26న ప్రశంసా పత్రాలతో సత్కరించాలన్నారు. పాఠశాలల్లో రోడ్డు నిబంధనలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్క్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. యూనిసెఫ్ సహకారంతో విద్యార్థులకు ట్రాఫిక్‌పై అవగాహన కలిగించడాన్ని పాఠ్యాంశంగా చేర్చనున్నట్లు తెలిపారు. వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడానికి, ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వివరించారు. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, దీని ద్వారా బాధితుడికి ఏడు రోజుల్లో రూ.లక్షా 50 వేల వరకు ఉచితంగా అందజేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులను తక్షణ సహాయం అందించిన వాహనదారులను ప్రోత్సహించడానికి రహవీర్ గుడ్ సమర్థన్ స్కీమ్ ద్వారా రూ.25 వేల రివార్డుతో అందించే పథకం రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు.
జనవరిలో జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాలు హెల్మెట్ బైక్ ర్యాలీలు, వాకథాన్ పరుగులు, రంగోలి పోటీలు, రోడ్డు భద్రత ప్రతిజ్ఞలు, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, మోటార్ సైకిల్ చిన్న హెల్మెట్ స్టిక్కర్ అతికించడం ద్వారా అవగాహన కల్పించడం, కారు విండ్ స్క్రీన్‌కు చిన్న సీట్ బెల్ట్‌ను అతికించడం ద్వారా అవగాహన కల్పించడం చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు – సమావేశాలు, వ్యాస రచన, డ్రాయింగ్, వక్తృత్వ పోటీలు, రోడ్లపై ఎన్‌సీసీ బృందాల ద్వారా అవగాహన, ఆడియో, విజువల్‌ల ద్వారా అవగాహన, స్థానిక రేడియో, సిటి కేబుల్స్‌లో రోడ్డు భద్రత చర్చలు, సినిమా థియేటర్లలో అవగాహన స్లైడ్‌లు, వీడియోలు, హోర్డింగ్‌ల ద్వారా, కళాకారుల బృందాలతో అవగాహన, ఆర్టీసీ బస్సు కండక్టర్ల ద్వారా కరపత్రాల పంపిణీ, బస్టాండ్లలో హోర్డింగ్‌లు, డిస్‌ప్లేలు, అనౌన్సర్‌ల ద్వారా అవగాహన ప్రచారం చేయాలని మంత్రి పొన్నం సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఆర్టీయే మెంబర్లు, నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పాల్గొనేలా రవాణా శాఖ, పోలీస్, ఆర్టీసీ, ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కిందిస్థాయి నుండి రాజధాని వరకు విస్తృత అవగాహన ద్వారానే మరణాల రేటును తగ్గించవచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఓవర్ లోడ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలరు. ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలను కాపాడే బాధ్యత మన అందరి పై ఉందని, కలెక్టర్లు రోడ్ సేఫ్టీ కమిటీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఎంజేపి సెక్రటరీ సైదులు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు, వివిధ సంక్షేమ శాఖ, రవాణా శాఖ, పోలీస్, ట్రాఫిక్, ఆర్ అండ్ బి, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





