భారతదేశ రోడ్లు, రహదారులు భద్రతకు కాకుండా, నిత్యం మారణహోమానికి చిరునామాలుగా మారుతున్నాయి. నవంబర్ 3, సోమవారం రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర విషాదం, అలాగే అంతకుముందు రోజు రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలో సంభవించిన దుర్ఘటన దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై నెలకొన్న భయానక పరిస్థితికి నిదర్శనం. రంగారెడ్డి జిల్లాలో కంకర లోడుతో అతివేగంగా, రాంగ్ రూట్‌లో వొచ్చిన లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో దాదాపు 20 మందికి పైగా అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం మనసును కలచివేస్తోంది. సరిగ్గా ఇదే తరహాలో, రాజస్థాన్ ఫలోడిలో ఆదివారం ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొన్న ఘటనలో 15 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు ఘటనలూ.. మన రోడ్లపై నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఎంత అపాయకరంగా పరిణమించాయో స్పష్టం చేస్తున్నాయి.
ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రమాదాలు, వాటిలో లక్షల మంది మరణిస్తున్నారు. కేవలం గత దశాబ్దంలోనే దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం, ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది. ఈ దుర్ఘటనల్లో ముఖ్యంగా 18-45 ఏళ్ల మధ్య వయస్కులు, అంటే దేశానికి వెన్నెముక అయిన యువతే అత్యధికంగా బలవుతున్నారు. ఇది కేవలం ప్రాణ నష్టమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావం చూపుతోంది.
వరుస రోడ్డు ప్రమాదాలకు ఒకే ఒక్క కారణం లేదు. ఇది అనేక అంశాల కలయిక. 68% మరణాలకు అతి వేగమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. తాజా చేవెళ్ల ప్రమాదంలో రాంగ్ రూట్, అతివేగమే ప్రాణాలు తీసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవర్ల పని ఒత్తిడి, నిద్రలేమి వంటివి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అశాస్త్రీయ ఇంజినీరింగ్, ప్రమాదకర ‘బ్లాక్‌స్పాట్’లను సరిదిద్దడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తోంది. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అక్రమాలు, ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ కేవలం జరిమానాల వడ్డింపునకే పరిమితం కావడం, నిబంధనలను పక్కాగా అమలు చేయకపోవడం..ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు వైద్య సహాయం (గోల్డెన్ అవర్) అందించడంలో ఆలస్యం కూడా కారణాలు అవుతున్నాయి.
ఈ మారణహోమాన్ని అరికట్టాలంటే ప్రభుత్వాలు, ప్రజలు తమ బాధ్యతలను గుర్తించాలి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలి. ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడిపే వారి లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయాలి. రాంగ్ రూట్‌లో వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. బ్లాక్‌స్పాట్‌లను యుద్ధప్రాతిపదికన గుర్తించి, సరిదిద్దాలి. రాజస్థాన్ ప్రమాదంలో మాదిరిగా, రహదారుల పక్కన వాహనాలను ఇష్టానుసారంగా నిలపకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. రోడ్డు భద్రతపై విస్తృత జన చైతన్యం తీసుకురావాలి.
‘గుడ్ సమారిటన్’ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రమాద బాధితులకు సహాయం చేసేలా ప్రోత్సహించాలి. కమర్షియల్ వాహన డ్రైవర్లకు (ముఖ్యంగా లారీలు, టిప్పర్ల డ్రైవర్లకు) పటిష్టమైన శిక్షణ, పని గంటలపై పర్యవేక్షణ తప్పనిసరి చేయాలి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేసి, ఆ తరువాత మరిచిపోవడం కాకుండా, ప్రభుత్వాలు రోడ్డు భద్రతను ఒక జాతీయ సమస్యగా గుర్తించాలి. రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించాలనే లక్ష్యంతో భారత్ సంతకం చేసిన అంతర్జాతీయ డిక్లరేషన్‌కు అనుగుణంగా బహుముఖ వ్యూహాన్ని అమలు చేయాలి. చేవెళ్ల, ఫలోడి వంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడటమే మృతులకు మనం ఇచ్చే నిజమైన నివాళి. ప్రతి ప్రాణం విలువైనదే.





