భవిష్యత్ అభివృద్ధికి రోడ్ మ్యాప్

– తెలంగాణ రైజింగ్-2047తో ముందుకెళ్తున్నాం
– ఎన్నో సంస్కరణలు చేపడుతున్నాం
– గుడ్ గవర్నెన్స్ కాదు.. స్మార్టు గవర్నెన్స్ కావాలి
– మూసీ విషయంలో రాజకీయం చేయొద్దు
– ఎవరినీ నిరాశ్రయులను చేయం
– శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: దేశంలో ఎన్నో నగరాలున్నా పొలిటికల్ రాజధానిగా దిల్లీ, ఫైనాన్షియల్ కేపిటల్‌గా ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల గురించి మాత్రమే చర్చించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. శాసనమండలిలో సోమవారం ఆయన మాట్లాడుతూ దిల్లీలో కాలుష్యం కారణంగా పాఠశాలలలకు, కార్యాలయాలకు సెలవులు ఇస్తున్నారు.. ముంబైలో వర్షాలతో వరదలు వచ్చే పరిస్థితి.. అక్కడ నివసించలేని పరిస్థితి కూడాను, బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్, చెన్నైలో వరదలతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ రాక్స్ అండ్ లేక్స్ సిటీ.. అది ఓల్డ్ సైట్ అని మనం చెప్పుకుంటున్నా ఒరిజినల్ సిటీ.. చార్మినార్, గుల్జార్ హౌస్, మనం ఉన్న శాసనమండలి ఎన్నో చారిత్రక కట్టడాలు నగరంలో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న నగరంలో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ప్రధానంగా వాహనాల సంఖ్య పెరిగినందున వీటికి పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రవాణాలో రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టు, పోర్టు కీలకం. సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసుకున్నామని, మెట్రోను నిర్మించుకున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్-2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని, తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు జోన్లుగా విభజించుకున్నామని, ‘క్యూర్’ పరిధిని సర్వీస్ సెక్టార్‌గా, ‘ప్యూర్’ను మాన్యుఫ్యాక్చర్ హబ్‌గా, ‘ రేర్’ను అగ్రికల్చర్ రంగంగా అభివృద్ధి చేయబోతున్నామని వెల్లడించారు. ఔటర్ రింగు రోడ్డు ఇన్‌సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అని, ఈ ప్రాంతంలోని కాలుష్య కారక పరిశ్రమలకు ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తే మధ్యతరగతికి భూమి అందుబాటులోకి వస్తుందని, నగరం నివాస యోగ్యంగా మారుతుందని అన్నారు. రోడ్లను అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్ అని మూడు భాగాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రణాళికలు రచించామని సీఎం వివరించారు. 29 ప్రాంతాల్లో జరుగుతున్న పనుల ప్రణాళికలు మీ ముందు పెట్టామని, ఎల్ అండ్ టీతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించిందని, మెట్రోలో లాస్ట్ మైల్ కనెక్టివీటీ లేదని. అందుకే మెట్రోను విస్తరిస్తున్నామని చెప్పారు. మెట్రో విస్తరణకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని, త్వరలోనే విస్తరణను చేపట్టబోతున్నామని అన్నారు.

బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి అండర్ పాస్
బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి కూడా అండర్ పాస్ రోడ్డుకు అనుమతి తీసుకొచ్చామని, దేశంల్ రన్ వే కింద ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదని పేర్కొన్నారు. నల్లగొండ, విజయవాడ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్లను పూర్తి చేసుకుంటున్నామని, నగరంలో సిగ్నల్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించి ప్రయాణం సాఫీగా సాగేలా చేయాలనేది తమ ప్రయత్నమని, కొంత కఠినం అనిపించినా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ చిరు వ్యాపారుల కోసం ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సహిద్దామన్నారు. కేబీఆర్ పార్కు దగ్గర మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేశామని, సంస్కరణల్లో భాగంగా ఇలాంటి చర్యలను చేపడుతున్నామని వివరించారు. హైదరాబాద్ దిల్లీ లాంటి నగరంలా మారవద్దనే హిల్ట్ పాలసీ తీసుకొచ్చామన్నారు. ఇండస్ట్రియల్ జోన్‌కు మల్టీ జోన్‌గా భూమిని బదలాయిస్తున్నాం తప్ప యాజమాన్య హక్కులు ఎవరికీ అందించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ వెంట సిటీ మధ్యలో నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతున్నామని, కేవలం 40 కి.మీ ప్రయాణంతో చేరుకోవచ్చని, పారదర్శకంగా పనులు జరిగేలా ప్రతీ విభాగానికి ఒక పాలసీని తీసుకొచ్చామని ప్రకటించారు. ఇప్పుడు మనం దృష్టి సారించాల్సింది గుడ్ గవర్నెన్స్‌పై కాదని, స్మార్ట్ గవర్నెన్స్‌పైన అని, పరిపాలన సౌలభ్యం, అధికారుల మధ్య సమన్వయం ఉండేలా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి పరిధిని ఒకే విధానంగా తీసుకొచ్చామని, హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా మూడు కార్పొరేషన్లుగా విభజించాం.. నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. భవిష్యత్ అభివృద్ధి కోసం రోడ్ మ్యాప్‌ను తయారు చేసుకున్నామన్నారు.
మూసీపై రాజకీయాలు చేయొద్దు : ఎవరినీ నిరాశ్రయులను చేయం
మూసీ రివర్ డెవలమెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది తామే అని సిరిసిల్ల ఎమ్మెల్యే చెప్పారని, ప్రారంభించి మీరు వదిలేస్తే తాము ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. మూసీ ప్రక్షాళనపై ఎందుకు రాజకీయం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు రండి.. రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టండి.. నాకు సూచనలు ఇవ్వడానికి ఇబ్బంది అనుకుంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబులతో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తాం.. మీ సలహాలు, సూచనలను కమిటీకి సమర్పించండి అని చెప్పారు. తాము ఎవరినీ నిరాశ్రయులను చేయడంలేదు.. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఎవరినీ నిరాశ్రయులను చేయం.. పునరావాసం కల్పిస్తానని మీ ద్వారా ప్రభుత్వం మాట ఇస్తున్నది.. ఏ ఒక్కరికీ నష్టం చేయం.. మెరుగైన వసతులు కల్పిస్తాం అని మూసీ పరివాహక ప్రజలకు భరోసా ఇచ్చారు. మూసీ నిర్వాసితులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని కోరుతున్నానన్నారు. అధికారులు మీకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజకీయ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించొద్దు.. అభివృద్ధిని అడ్డుకోకండి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
—————————————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *