రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

– న‌లుగురి మృతి 20మందికి గాయాలు
– ఆగి ఉన్న లారీని ఢీకొన్న పెళ్లి బృందం బస్సు.
– నలుగురు మృతి,20 మందికి పైగా తీవ్ర గాయాలు
– ప్రాణాలు తీసిన అతివేగం

పరిగి మండలం రంగాపూర్ సమీపంలో జాతీయ రహదారి 163 పై సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం వివాహం జరుపుకుని సోమవారం రాత్రి పరిగి లో విందు ఉండడంతో, అబ్బాయి తరపు బందువులు విందుకు హాజరై, తిరిగి వారి స్వగ్రామం అయిన రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, చందనవెళ్లి గ్రామానికి వెళ్తుండగా . రంగాపూర్ సమీపంలో రోడ్డు పక్కన ఆగిఉన్న లారీనీ పెళ్లి బృందంతో వెళ్తున్న ఎస్.కె.హెచ్. ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. బస్సులో సుమారు 60 మంది వరకు ఉండగా, నలుగురు బస్సులో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు.  ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని పరిగి ప్రభుత్వ హాస్పిటల్ కు  తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని, మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో నీలోఫర్ హాస్పిటల్ కు  తరలించినట్లు పోలిసులు తెలిపారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను  జేసిబి సహాయంతో అతి కష్టంగా బయటకు తీశారు. స్థానికులు, పోలీసుల సహాయంతో క్షతగాత్రులను 108 సహాయంతో పరిగి ప్రభుత్వ హాస్పిటల్  తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురిలో ఉంచారు. పెళ్లి బృందం  రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెళ్లి గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతులు ,బాలమ్మ ,(60), హేమలత (30) , మల్లేష్ (26), సందీప్ (28) గా పోలీసులు వెల్లడించారు. విషాద ఘటన నేప‌థ్యంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. రోడ్డుపై ప్రమాదం జరగడంతో నేషనల్ హైవే 163పై ఇరువైపులా అటు హైదరాబాద్, ఇటు పరిగి బీజాపూర్ వైపు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి.

అతివేగమే ప్రమాదానికి కారణం:  డిఎస్‌పీ శ్రీనివాస్.
బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్షంగా నడుపుతూ ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పరిగి డిఎస్పి శ్రీనివాస్ తెలిపారు.ఘటనలో నలుగురు మృతి చెందినట్లు, మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, దాదాపు 20 మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్టు తెలిపారు.. పూర్తి విచారణ అనంతరం ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పై, రోడ్డు పక్కకు ఆపిన లారీ డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని ఆయ‌న‌ తెలిపారు.

సీ ఎమ్ , పలువురు నేతల దిగ్భ్రాంతి

క్షత గాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అధికారులతో దుర్ఘటనపై ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. రోడ్డు ప్రమాద ఘటనపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *