హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 24: టీఈఎల్ నెంబర్ లేకుండా పత్రికల్లో ఊహాజనిత వార్తలు రాస్తే చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖకు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (పీఆర్‌జీఐ) కఠిన ఆదేశాలు జారీ చేసింది. త్వరలో జిల్లా సమాచార, పౌరసంబంధాల అధికారులకు కూడా ఈ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంపై అసత్య వార్తలు ప్రచురిస్తూ దేశ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా కొన్ని ఆర్‌ఎన్‌ఐ లేని పత్రికలు సత్యదూరమైన వార్తలు ప్రచురిస్తున్నాయని, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసంఖ్యాóకంగా పిడిఎఫ్ పత్రికలు సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు సృష్టిస్తున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా సీనియర్ పాత్రికేయుడు ఎస్.నరహరి నాగేశ్వరప్రసాద్ పీఆర్‌జీఐ, న్యూధిల్లీికి అప్పీలు చేశారు. ఆ పిర్యాదుపై పీఆర్‌జీఐ లోతుగా అధ్యయనం చేసి ఆర్‌ఎన్‌ఐ లేని పత్రికలపై వేటు కు రంగం సిద్ధం చేసింది. ఈమేరకు ఆర్‌ఎన్‌ఐ లేని పత్రికల వార్తలను ప్రామాణికంగా తీసుకోవద్దని, తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోవద్దని, అలాగే పత్రిక భాషలో వాడాల్సిన పదాలను పూర్తిస్థాయిలో పొందుపరిచి ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని గమనించి జిల్లా పౌరసంబంధాల అధికారులు ఆర్‌ఎన్‌ఐ లేని పత్రికల పూర్తి సమాచారాన్ని సేకరించి రాష్ట్ర కార్యాలయాలకు పంపాలని ఆదేశాలు జరీ చేసింది.
ఆర్‌ఎన్‌ఐ లేని పత్రికలపై వేటు





