రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు

మంత్రి పొన్నం ప్రభాకర్‌

నల్లగొండ, ప్రజాతంత్ర, జులై 12: వాహన ప్రమాదాలు చేస్తే అవసరమైతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసేలా భవిష్యత్తులో చర్యలు చేపట్టనున్నట్లు రవాణా, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. వాహనాల వెనకవైపు రిఫ్లెక్టర్‌ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునే విధంగా జీవో తీసుకురానున్నమని, అలాగే డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని దండంపల్లి వద్ద రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌(ఏటీఎస్‌) భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ఫిట్‌నెస్‌ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని తగ్గించేందుకు ఏటీసీ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ స్టేషన్‌లోని సాంకేతిక పరికరాల సహాయంతో సుమారు 15 అంశాలలో వాహనం రోడ్డుపై తిరిగేందుకు పనికొస్తుందా లేదా అన్నది నిర్ధారిస్తారన్నారు. రవాణా శాఖలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటి రూ.8 కోట్లతో 17 ఏటీఎస్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిరచారు. ఇప్పటివరకు రవాణా శాఖ ద్వారా స్క్రాపింగ్‌ పాలసీని తీసుకొచ్చామని, ఏటీసీ వల్ల ప్రతి వాహనం వాహన సారథి పరిధిలోకి వచ్చేలా తెలంగాణను వాహన సారథిలో భాగస్వామ్యం చేశామని, ట్రాఫిక్‌ అవేర్నెస్‌లో భాగంగా క్యాంపుల నిర్వహణ, పాఠశాలల్లో విద్యార్థులకు క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌లను ఆటోమేటిక్‌గా నిర్వహించి అందులో ఉత్తీర్ణులైతేనే లైసెన్స్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల 20 నెలల్లో 200 కోట్లమంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, నల్గొండ జిల్లాకు 70 ఈIబస్సులు ఇవ్వగా 10 బస్సులు నార్కెట్‌ పల్లికి, తక్కినవి ఇతర ప్రాంతాలకు తిప్పనున్నట్లు వెల్లడిరచారు. నార్కెట్‌పల్లికి 80 కొత్త బస్సులు కావాలని, అలాగే నార్కెట్‌పల్లికి నూతన డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వాహనాల ఫిట్‌నెస్‌ సరిగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లాలో ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయడం సంతోషమని, జిల్లా యంత్రాంగం తరఫున ఏటీసికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. జిల్లా ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ శ్రీవాణి మాట్లాడుతూ మాన్యువల్‌గా కాకుండా మిషన్‌ ద్వారా వాహనాలను పరీక్షించే అవకాశం ఏటిసి ద్వారా ఉందన్నారు. కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్‌ రెడ్డి, నకిరేకల్‌. మిర్యాలగూడ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ నారాయణ అమిత్‌, రవాణా శాఖ కమిషనర్‌ చంద్రశేఖర్‌, విశ్రాంత ఆర్టీవో మోహన్‌రెడ్డి, ఆర్టిఓ మెంబర్లు రాజిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని బస్‌ స్టేషన్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులను శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ప్రారంభించారు. నల్గొండ జిల్లాకు 77 ఎలక్ట్రిక్‌ బస్సులు మంజూరు కాగా రిజిస్ట్రేషన్‌ పూర్తయిన 40 బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి బస్‌ స్టేషన్‌ నుండి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వరకు బస్సు నడిపి ఆశ్చర్యపరిచారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు బస్సులో ప్రయాణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *