– 15 రోజులపాటు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం
– విలువైన సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ భేటీ
– మూసీ సబ్ కమిటీ సభ్యులు 24/7 అందుబాటులో
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: మూసీ పునరుజ్జీవ పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసీ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సహచర మంత్రి, మూసీ కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌తో కలిసి మూసీ పునరుజ్జీవ పనుల ప్రగతిపై అధికారులతో సోమవారం చర్చించారు. నేటినుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో musrirdc@gmail.com మెయిల్ ఐడి ద్వారా మూసీ పునరుజ్జీవంపై ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామని తెలిపారు. వీటిలోని విలువైన సలహాలు, సూచనలను అధికారులతో విశ్లేషించి అభిప్రాయాలు వెల్లడించిన వారితో దశలవారీగా సబ్ కమిటీ సభ్యులు నేరుగా సంప్రదింపులు జరుపుతారని డిప్యూటీ సీఎం తెలిపారు. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం పనులకు 28న శంకుస్థాపన జరిగిందని, ఆ రోజు నుంచి మూసీ ఫేజ్-1, ఫేజ్- 2 వరకు చేయాల్సిన పనులకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిఫెన్స్ భూములు, మూసీ పునరావాసితులతో సంప్రదింపులు, నిర్మాణ డిజైన్లు తుది దశకు తీసుకురావడం, బ్యాంకర్స్‌తో మాట్లాడటం ఇలా పనులను విభజించుకుని ముందుకు వెళ్లాలని అధికారులకు డిప్యూటీ సీఎం దిశా నిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యావత్ కేబినెట్ సంకల్పాన్ని అర్థం చేసుకొని అధికారులు ఉత్సాహంగా ముందుకు వెళ్లాలని, మీ జీవితాల్లో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. అధికారులకు ఎలాంటి సలహా, సూచన ఇతర ఏ అవసరాలు ఉన్నా మూసీ సబ్ కమిటీ సభ్యులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని తెలిపారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇ.వి. నరసింహారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, అధికారులు వినయ్ కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, మను చౌదరి, జీహెచఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



