పూజారుల అభిప్రాయాలు, భక్తుల అవసరాలకే పెద్దపీట
మేడారంలో పనులపై మంత్రి సీతక్క సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: గిరిజన మహా జాతర జరిగే ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా పూజారుల సూచనల మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. మేడారం పనులపై శనివారం సచివాలయంలో ఆమె సమీక్షించారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి, సమ్మక్క సారలమ్మల తెగువ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు. పూజారుల విశ్రాంతి గదులు, అత్యవసర వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, మీడియా ప్రతినిధులకు అవసరమైన వసతుల కల్పనకు సంబంధించి స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. భక్తులు పుణ్య స్నానాలాచరించే జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని, భక్తుల సౌలభ్యం కోసం ఘాట్లను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. రాబోయే మేడారం జాతరకు సంపూర్ణ ఏర్పాట్లు చేసేందుకు సమావేశమయ్యాం.. వారం రోజుల్లో గద్దెల చుట్టూ ఆధునీకరణ పనులకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసి పూజారుల ఆమోదంతో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి దశలో వారి అభిప్రాయాలు తీసుకుంటామని సమావేశంలో మంత్రి సీతక్క స్పష్టం చేశారు. భక్తుల కోసం మరిన్ని వసతులు కల్పించేందుకు కుంభమేళా లాంటి పెద్ద ఉత్సవాలలో వసతులు కల్పించిన ఏజెన్సీలను సంప్రదించి వారి సలహాలు తీసుకుని,మేడారం అభివృద్ధికి వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్లో ఉన్న కారణంగా సమావేశానికి రాలేకపోయారని, వారి సూచన మేరకు మేడారం ఆధునికీకరణ కోసం రాష్ట్రస్థాయి రెండో సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మేడారానికి దారి తీసే అన్ని మార్గాల్లో ఆదివాసీ పోరాట యోధుల విగ్రహాలు, ఆదివాసి చిహ్నాలను ప్రతిష్ఠిస్తామన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్, గిరిజన సాంస్కృతిక శాఖ అధికారులు, సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆలయ పూజారులు, ఆర్కిటెక్టులు పాల్గొన్నారు.





