– అభివృద్ధి పనుల్లో ప్రమాణాలు పాటించండి
– నిర్దేశిత సమయంలో పనులు పూర్తికావాలి
– ఆచార సంప్రదాయాలకు పెద్ద పీట వేయాలి
– మేడారం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: మేడారం అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దని, చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వొద్దంటూ ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించాలని, నాణ్యతాప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దని ఆదేశించారు. మేడారం అభివృద్ధి పనులపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాతి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు ఇలా ప్రతి ఒక్క అంశంపైనా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గద్దెల సమీపంలో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, గద్దెల దగ్గర గ్రాండ్ లుక్ వచ్చేలా నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, గుడి చుట్టు పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. పనులు సాగుతున్న తీరుపై అధికారులు ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, స్థపతి శివనాగిరెడ్డి సమన్వయంతో ఆయా పనులు సాగాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు పెద్ద పీట వేయాలన్నారు. నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





