బతుకమ్మ వేడుకలను జయప్రదం చేయాలి

– 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో గిన్నెస్‌ బతుకమ్మ వేడుకలు
– ఆయా మార్గాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలి
– నిమ‌జ్జ‌న ప్రాంతాల్లోరక్షణ చర్యలు తీసుకోవాలి
– నిర్వహణపై మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: ఈనెల 29న గిన్నెస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు లక్ష్యంగా సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క అధికారులను ఆదేశించారు. అంబేద్కర్‌ సచివాలయంలో అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 27న ట్యాంక్‌ బండ్‌పై బతుకమ్మ కార్నివాల్‌, 28న బైక్‌, సైకిల్‌ ర్యాలీలు, 29న సరూర్‌ నగర్‌ స్టేడియంలో పదివేల మంది మహిళలతో బతుకమ్మ గిన్నెస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు, 30న ట్యాంక్‌ బండ్‌పై సద్దుల బతుకమ్మ కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకనుగుణంగా ప్రతిష్ఠాత్మకంగా సన్నాహాలు జరగాలన్నారు. ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. ట్యాంక్‌ బండ్‌తోపాటు పీవీ మార్గ్‌, సచివాలయం, సరూర్‌ నగర్‌ స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్‌ దీపాలతో అలంకరించాలి.. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలి. మహిళలకు సౌకర్యాలు కల్పించాలి అని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లో చారిత్రక ప్రదేశాలతోపాటు ప్రధాన జంక్షన్లను అందమైన ఆకృతులతో, విద్యుత్‌ దీపాలతో అలంకరించాలన్నారు. పర్యాటక, సాంస్కృతిక, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పోలీస్‌, ట్రాన్స్‌కో, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సరూర్‌ నగర్‌ స్టేడియంలో ఈనెల 29న పదివేల మందితో 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేసి గిన్నెస్‌ బుక్‌ రికార్డుల్లో చేర్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను తరలించే బాధ్యతను సెర్ప్‌ అధికారులు తీసుకోవాలని, మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కళాకారుల మధ్య వేలాదిమంది మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, నగరవాసులు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. సమీక్షలో మహిళా కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి, సెర్ప్‌ సీఈఓ దివ్యాదేవరాజన్‌, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ నరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాగా, ప్రముఖ సింగర్‌ గడ్డం సంతోష్‌ రూపొందించిన బతుకమ్మ పాటను సచివాలయంలో మంత్రులు జూపల్లి, సీతక్క, కొండా సురేఖలు ఆవిష్కరించారు. ప్రజా పాలన బతుకమ్మ పాటను రూపొందించిన సంతోష్‌ను వారు అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *