అధికారుల సమన్వయంతోనే గట్టెక్కాం

– కామారెడ్డి వరద పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష
– జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం

కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 28: కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్క ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మార్గదర్శకత్వంలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని, క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఏర్పడిన భయంకర వరద పరిస్థితులను ఎదుర్కొని ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని పేర్కొన్నారు. హాస్టల్లో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను రక్షించడం, పోచారం డ్యామ్‌ కింద మునిగిపోయిన 14 గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రే పునరావాస కేంద్రాలకు తరలించడం వంటి చర్యలు అధికారుల కృషి, సమన్వయానికి నిదర్శనమని మంత్రి అభినందించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి స్వయంగా లేకపోయారని మంత్రి సీతక్క వివరించారు. రోడ్లు, చెరువుల కట్టలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు చేపట్టాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలకు తెలియజేయాలని, ప్రమాదకర రహదారులపై పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్‌ పనులు వేగవంతం చేసి వ్యాధులు ప్రబలకుండా చూడాలని, ఇండ్లలోకి చేరిన నీటిని తొలగించి శుభ్రపరచాలని ఆదేశించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ, విద్యుత్‌, పంచాయతీరాజ్‌ శాఖలు నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని సూచించారు.
మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని, వాగులు, చెరువుల కింద ఉన్న గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ నష్టం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పనిచేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ జిల్లా ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా వరద బీభత్సాన్ని చవిచూసిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో చక్కగా పనిచేసిన జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్ట్కర్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు, స్పెషల్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, ఫైర్‌ అదనపు డీజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ సంగ్వాన్‌, ఎస్పీతో పాటు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *