– కమర్షియల్ టాక్స్‌లో సర్కిల్ వారీగా ప్రగతిని సమీక్షించాలి
– రిజిస్ట్రేషన్ శాఖపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి
– ఆదాయ వనరుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో వివిధ శాఖల నుంచి ఆదాయం పెంపుపై లోతైన అధ్యయం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విమ్రార్క అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ సమావేశం సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్యంగా వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్, శాఖల ద్వారా ఆదాయం పెంపుపై సుదీర్ఘ సమీక్ష జరిగింది. వాణిజ్య పన్నుల శాఖలో సర్కిల్ వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. వివిధ రకాల వస్తువుల వారీగా సమీక్ష చేయాలని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలి కోరారు. స్టాంప్స్, రెవెన్యూ శాఖలో ఆదాయం పెంపునకు గత ఏడాది వేసిన కమిటీ, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు పరిస్థితిపై భట్టి సమీక్షించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖతో ముడిపడి ఉన్న హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హౌసింగ్ బోర్డు వంటి ఇతర శాఖలను సమన్వయం చేసుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలను సమన్వయం చేసుకునే అంశాన్ని చీఫ్ సెక్రటరీ(సీఎస్) రామకృష్ణారావు సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుదలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక తెప్పించాలని కూడా ఆయనను ఆదేశించారు. రవాణా శాఖలో లక్ష్యాలను చేరుకోకపోవడానికి కారణాలు, వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది చర్చించాలన్నారు. అవసరమైతే ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని మంత్రులు తెలిపారు. సమీక్ష సమావేశానికి వచ్చే ముందు అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆయా శాఖల్లో ఆదాయం పెంపుదలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక స్పష్టమైన నివేదికతో రావాలని డిప్యూటీ సీఎం సూచించారు. సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుదిళ్ల్ల శ్రీధర్‌బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.రిజ్వీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, కమర్షియల్ టాక్స్ కమిషనర్ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





