– పరిగిలో భూములు లాక్కునే యత్నం
– రైతుల పరామర్శకు వెళ్తున్న హరీష్‌రావు తదితరుల అరెస్ట్
– శంషాబాద్ పీఎస్ వద్ద సీఎంపై విరుచుకుపడ్డ హరీష్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: పరిగిలో భూముల లాక్కొని తన సోదరుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆరఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.. 900 రోజులైనా ఎందుకు పూర్తి చేయలేదంటూ సూటిగా ప్రశ్నించారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ రేవంత్.. నువ్వు మళ్ళీ గెలవడం కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా నీ పార్టీకి రాదని జోస్యం చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. పరిగిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే తమను అరెస్టు చేశారన్నారు. రేవంత్ రెడ్డిది గడీల పాలన.. బేడీల పాలన.. గుడ్డి పాలన అంటూ అభివర్ణించారు. సాగుకు పనికిరాని భూముల్లో పరిశ్రమలు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ఎస్సీ, ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను ఎందుకు లాక్కుంటున్నారంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. బోగస్ మాటలు.. బోగస్ పాలన అంటూ రేవంత్ పరిపాలనను ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి మించిన రావణాసురుడు ఎవరైనా ఉన్నారా అని ఈ సందర్భంగా హరీష్ రావు ప్రశ్నించారు. పోలీసు నిర్బంధం, అణచివేతల మధ్య హరీష్‌రావు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, దివాకర్ రావు, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల దయాకర్‌రావులతో కలిసి పరిగి రైతుల వద్దకు బయల్దేరారు. మార్గంమధ్యలో అప్పా జంక్షన్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. హరీష్‌రావు కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా లారీలను రోడ్డుÅ£డ్డంగా పెట్టారు. హరీష్‌రావును అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆరఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీఆరఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అప్పా జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వారందరినీ శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రేవంత్ ఆలోచనలన్నీ భూముల చుట్టూనే
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతది అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు అన్నీ భూమి చుట్టే తిరుగుతున్నయి అని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు వ్యాఖ్యానించారు. లగచర్ల అంటడు.. హెచ్‌సీయూ అంటడు.. హిల్ట్‌పీ అంటడు.. నాదర్‌గుల్ భూములు అంటడు.. ఇవ్వాళ పరిగిలో భూములు లాక్కుంటడు.. పాలన చేయమంటే భూముల మీద పడ్డడు అని విమర్శించారు. నాటి ఇందిరమ్మ భూములు ఇస్తే నేటి ఇందిరమ్మ పాలనలో పేదల భూములు లాక్కుంటున్నడన్నారు. పరిగి నియోజకవర్గంలో దళిత, గిరిజన బలహీనవర్గాల భూములను ఇండస్ట్రియల్ పార్కుల పేరిట ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తున్నదని, ప్రధాన ప్రతిపక్షంగా తాము పరిగి రైతుల వద్దకు వెళ్తుంటే అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నరు. ప్రజాస్వామ్యం అనే ఏడో గ్యారెంటీ ఇస్తున్నాం.. ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పిస్తం అన్నరు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బలహీనవర్గాల గొంతుకగా మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. తమ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అరెస్టు చేసి గంటకో పోలీసు స్టేషన్‌కు పంపుతున్నారంటూ మండిపడ్డారు. రైతుల గోస వినడానికి కళ్లాపూర్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నామని, ఉదయాన్నే పోలీసులు వెళ్లి టెంట్లు చింపి రైతులను, మహిళలను అరెస్టు చేశారని, అక్కడికొస్తే కేసులు పెడతామని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వచ్చిన రెండున్నరేండ్లలో పరిశ్రమలు పెడతాం అని నోటిఫికేషన్లు ఇచ్చి 10వేల ఎకరాల దళితుల, ఎస్టీల భూములు లాక్కున్నడు.. ఇంక 40వేల ఎకరాల భూములు లాక్కుంటడట.. ఎందుకు భూముల మీద దండ యాత్ర చేస్తున్నవు అని అడగడానికి వెళ్తున్నం అని అన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్ ఉండి వికారాబాద్ జిల్లాకు శాపం అయ్యిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నరంటూ నువ్వు అడ్డుకోవాలని చూసినా మా పోరాటం ఆగదు.. బాజాప్త రైతుల వద్దకు వెళ్తం.. వాళ్ల పోరాటానికి బాసటగా నిలుస్తం అని హరీష్‌రావు స్పష్టం చేశారు. భూముల వెంట పడకండి.. 22ఏ నిషేధిత జాబితాపై సమీక్షించి తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఉపసంహరించుకుని పరిగి రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, అప్పటిదాకా తమ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





