-కేసీఆర్ మనోడు..రేవంత్ మందోడు
-ఏపీకి నీళ్లు తాకట్టు పెడుతున్న ద్రోహం
-పాలమూరులో మిగిలిన పనులు చేయలేదు
-పరిగిలో రేవంత్ వ్యాఖలపై హరీష్‌రావు ఆగ్రహం
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: ఎన్నికల సభల్లో ఎవరైనా ఏం మాట్లాడుతారు? రెండున్నరేళ్లలో ఇవి చేసినం, భవిష్యత్తులో ఇవి చేస్తం అని చెబుతుంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నడు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లోనూ అదే రోత మురుగు పారిస్తున్నడు. మిర్యాలగూడ అయినా, నిజామాబాద్ అయినా, ఈరోజు పరిగి అయినా ఏం మాట్లాడుతడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను నిన్ను చీరుతా, పేగులు మెడలో వేసుకుంటా అని రంకెలు వేస్తున్నడని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు నియోజకవర్గం, జిన్నారంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష మంచిదా? రాజకీయాలు ఇంత హీనంగా ఉంటయి అనుకోరా? ఇయ్యాల పరిగిలో ఏమంటడు.. కేసీఆర్ మనోడు కాదు, పరాయోడు అట. పక్క రాష్ట్రం కోసం పని చేస్తడట ఇంతకంటే దివాలాకోరుతనం ఉంటదా? ఎవరు మనోడు , ఎవరు మందోడో ప్రజలకు తెలియదా? కేసీఆర్ ఉద్యమం పెట్టిన నాడు నువ్వు ఎక్కడున్నవు రేవంత్ రెడ్డి? కేసీఆర్ జై తెలంగాణ అంటే, రేవంతు జై సమైక్యాంధ్ర అన్నడని గుర్తుచేశారు. ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ పట్టపగలు దొరికిన దొంగవు నువ్వు. ఎవరు మనోడో, ఎవరు మందోడో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర కేసీఆర్ ది, ద్రోహ చరిత్ర రేవంత్ రెడ్డిది. తెలంగాణ ఉద్యమంలో నీది అదే ద్రోహ బుద్ధి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక కూడా నీది అదే ద్రోహ బుద్ధి. నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పేరుతో మన గోదావరి నీళ్లను ఏపీ తరలించే కుట్రలకు సహకారం అందిస్తున్నడని ఆరోపించారు. కృష్ణా జలాలు వినియోగించకుండా ఉద్దేశ్యపూర్వకంగా నీళ్లను కిందకు వదులుతున్నడు. చంద్రబాబు పంచన చేరి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాస్తున్నడు. దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉన్నది రేవంత్ తీరని అన్నారు. ఈరోజు పరిగిలో సిగ్గులేకుండా రంగారెడ్డికి మేం నీళ్లు ఇవ్వలేదు అని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నడు. బిఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80శాతం పనులు పూర్తి చేస్తే మిగతా పని పూర్తి చేయకుండా చోద్యం చూస్తున్న దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిండు కేసీఆర్ . కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీస్తడట. ప్రతిపక్షాన్ని తిడుతూ కాలం గడపడం తప్ప ఇంకేం చేయగలవు.. పాలన గాలికి వదిలి పద్దతి లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. రేవంత్ డైవర్షన్ కామెంట్స్ ను, తిట్లను పట్టించుకోకండి. అభివృద్దిని చూసి ఓటేయండి. కారు గుర్తుకు ఓటు వేసి మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురేయండి. రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇచ్చిన హామీలు అమలు చేసే దాకా నిన్ను విడిచి పెట్టేది లేదు. ప్రజాక్షేత్రంలో నీ వెంట పడుతూనే ఉంటమన్నారు. రెండున్నరేండ్ల పాలన తర్వాత పాలు, నీళ్లు తేలిపోయింది. మాట తప్పనోడు మడమ తిప్పనోడు కేసీఆర్ అని అందరికి తెలుసు. కానే కాదు, రానే రాదన్న తెలంగాణను తెచ్చి మన చేతుల్లో పెట్టిండు. తెచ్చిన తెలంగాణను అభివృద్ది పథాన నడిపిండు. కేసీఆర్ వచ్చాక ఇంటింటికి నల్ల పెట్టిండు, మంచినీళ్లు తెచ్చిండు. అవ్వతాతలకు పింఛన్లు పెంచడమే కాదు.. కొత్తగా 20లక్షల పింఛన్లు ఇచ్చిండు .. రైతు బంధు ఇచ్చిండు. లక్షా 60వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు. రేవంత్ అవ్వతాతలకు పింఛన్లు పెంచుతా అని మాట తప్పిండు. మహాలక్ష్మి పథకం ద్వారా 2500 ఇస్తానని మహిళలను మోసం చేసిండు. కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం అతీలేదు గతీ లేదు. రైతు బంధు లేదు, పంట బోనస్ లేదు 2 లక్షల రుణ మాఫీ ఎగ్గొట్టిండు. మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు అని ఎగనామం పెట్టిండు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు. కాంగ్రెస్ వచ్చింది మల్లా కరెంట్ కోతలు ప్రారంభం అయ్యాయి. జిన్నారం సభ చూస్తే ఎన్నికల తర్వాత జరిగే విజయోత్సవ సభగా కనిపిస్తున్నది. జిన్నారంలో ఎగిరే జెండా గులాబీ జెండా ఖాయమన్నారు.
—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




