రేవంత్ బినామా లావాదేవీల‌పై విచార‌ణ జ‌ర‌పాలి

– దివాలా తీసిన కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు
– స‌ద‌రు కంపెనీపై ఇప్పటికే అనేక కేసులు
– కేంద్ర హోమ్ మంత్రికి కేటీఆర్ లేఖ‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12:  రాష్ట్రంలో తీవ్రంగా దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అక్రమంగా కాంట్రాక్టులు కేటాయిస్తున్న వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. కేఎల్ఎస్ ఆర్‌ కంపెనీకి సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసిందని ఆరోపించారు. విచారణలో భాగంగా సేకరించిన కీలకమైన సాక్ష్యాధారాలు పోయాయని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు, దర్యాప్తు విభాగాలపైన ఉన్న ఒత్తిళ్లకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీకి లాభం చేకూర్చేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, విచారణ సంస్థలు, పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు. కేఎల్ఎస్ ఆర్‌ కంపెనీ ఇప్పటికే దివాలా ప్రక్రియలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంస్థకు భారీగా కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని విమర్శించారు. దివాలా ప్రక్రియ కొనసాగుతున్న ఈ కంపెనీకి రూ.2500 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు కేటాయించినట్లు నివేదికలు చెబుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రాజెక్టులు, ప్రధాన రహదారి నిర్మాణ పనులు వంటి అనేక కీలక ప్రభుత్వ ప్రాజెక్టులను ఈ కంపెనీకి అప్పగించడం ప్రభుత్వ కొనుగోలు విధానాలపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నదన్నారు. కేఎల్ఎస్ఆర్‌ కి ముఖ్యమంత్రికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిన విషయమేన‌న్నారు. గతంలో జరిగిన ఆదాయపు పన్ను విచారణలో ముఖ్యమంత్రి దీర్ఘకాలంగా ఉపయోగించిన టొయోటా ల్యాండ్ క్రూజర్ (టీఎస్‌ 07 ఎఫ్ఎఫ్‌ 0009) వాహనం కేఎల్ఎస్ఆర్‌ కంపెనీ పేరిట నమోదై ఉన్నట్లు బయటపడిందని ఆయన గుర్తుచేశారు. ఈ కంపెనీకి సంబంధించిన దివాలా వ్యవహారం నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందు విచారణలో ఉండగా విచారణను ప్రభావితం చేసే ప్రయత్నాల నేపథ్యంలో 2025 ఆగస్టు 13న ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ శరద్ కుమార్ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్లు నివేదికలు వెల్లడించాయని కేటీఆర్ తెలిపారు. 2022లో కేఎల్ఎస్ఆర్‌ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించిన యాజ్ మెట్ కార్ప్  సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా 75 సంవత్సరాల వయసున్న క్యాన్సర్ రోగిని అరెస్టు చేయడం మానవతా కోణంలో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు.

హైకోర్టులో విచారణ జరుగుతున్న రిట్ పిటిషన్ నెం.18267/2025 సందర్భంగా కీలకమైన సాక్ష్యాధారాలుగా స్వాధీనం చేసుకున్న పత్రాలు అధికారిక కస్టడీ నుంచి కనిపించకుండా పోయిన విషయం బయటపడిందని కేటీఆర్ తెలిపారు. దీనిపై గౌరవ ప్రధాన న్యాయమూర్తి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు గుర్తుచేశారు. అదేవిధంగా రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం కూడా సాక్ష్యాధారాల భద్రతపై అనుమానాలను మరింత పెంచిందన్నారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, కేఎల్ఎస్ఆర్‌ కంపెనీపై ఉన్న ఆర్థిక ఆరోపణలు, కాంట్రాక్టుల కేటాయింపులో జరిగిన అక్రమాలు, మనీ లాండరింగ్ అనుమానాలపై పక్షపాతం లేకుండా పూర్తిస్థాయి విచారణ జరగాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో సంపూర్ణ దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు. ప్రభుత్వ నిధులను కాపాడడం, పాలనలో పారదర్శకత, చట్టబద్ధమైన వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని కాపాడేందుకు ఈ అంశంపై స్వతంత్ర విచారణ జరగడం అత్యవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. లేఖ ప్రతులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌లకు కూడా పంపినట్లు కేటీఆర్ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *