– ఎన్నికల సంఘం విచారణ జరపాలి
– రేవంత్ రెండేళ్లుగా ఏమీ చేయకుండా తనపై విమర్శలా?
– మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతికి సీఎం రేవంత్ బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మహత్యపై అనుమానాలున్నాయన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దిల్లీలోని తన నివాసంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తలాతోకా లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ రెండేళ్లుగా మాటలతో కాలయాపన చేశారని.. ఏం చేస్తారో చేతల్లో చూపించాలన్నారు. ఇచ్చిన మాటపై నిలబడే శక్తి లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన పేరును మార్చి పిలుస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘మీరు రేవంత్ ఖాన్ అని మార్చుకోండి మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు? వ్యక్తిగత విమర్శలు సరికాదు. మీకు దెయ్యాలు దేవతల్లా కనపడవచ్చు. మజ్లిస్‌తో మీరు కాపురం చేసినన్నాళ్లూ మేం నిప్పులు పోస్తాం అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని స్థానాల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తాను ఎవ్వరికీ దత్తపుత్రుడ్ని కాదని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఏవైనా విభేదాలుంటే వారే తేల్చుకోవాలని, తనను మధ్యలో లాగడం ఎందుకని ప్రశ్నించారు. తన గురించి తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేయకుండా కిషన్ రెడ్డి పేరు మారుస్తానని అంటున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డురాకుండా చూసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ.. ఒక్క రోజూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని విమర్శించారు. తామెప్పుడూ బీఆర్‌ఎస్‌తో కలవలేదని తేల్చిచెప్పారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయని గుర్తుచేశారు. ఇప్పుడేమీ చేయలేక తనపై ఆడి పోసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదా? కిషన్ రెడ్డిదా ? అనేది సమాజం ఆలోచించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





