రేవంత్‌ రెడ్డిపై కేసు కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: గచ్చిబౌలిలో ఎ.రేవంత్‌ రెడ్డిపై 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రేవంత్‌పై కేసు నమోదుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేవలం ఆరోపణలు తప్ప వ్యక్తిగతంగా సంఘటన స్థలంలో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు ఆధారాల్లేవని పేర్కొంది. 2016లో ఒక భూమి వివాదానికి సంబంధించి గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని, దీనిని కొట్టివేయాలంటూ రేవంత్‌రెడ్డి 2020లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య గురువారం తీర్పు చెప్పారు. గోపన్నపల్లిలో సర్వే నెం.127లోని 31 ఎకరాలకు సంబంధించి హక్కుల వివాదంలో ఎస్సీ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి, నాటి ఎంపీ రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి, ఎ.లక్ష్మయ్యల మధ్య వివాదముంది. ఎంపీగా ఉన్న రేవంత్‌ అండతోనే సొసైటీ స్థలంలోకి అక్రమంగా చొరబడ్డారని, ఎస్సీ కులం పేరుతో దూషించారని సొసైటీకి చెందిన ఎన్‌. పెద్దిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ రేవంత్‌రెడ్డి పిటిషన్‌ వేయగా ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాదులు రఘు, ఆర్‌.గిరికుమార్‌ వాదించారు. ఘటన జరిగినప్పుడు పిటిషనర్‌ క్షేత్రస్థాయిలో లేనేలేరని చెప్పారు. పోలీసుల చార్జిషీట్‌లో కూడా రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతో అని ఉందేగానీ సంఘటన స్థలంలో ఉన్నట్లు పేర్కొనలేదన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వరరావు స్పందిస్తూ ఇదే భూమికి సంబంధించి గతంలో ఇదే ఫిర్యాదుదారుడు చందానగర్‌ పీఎస్‌లో పిటిషనర్‌పై ఫిర్యాదు చేశారని, ఆ కేసులో కూడా రేవంత్‌రెడ్డిపైనే ప్రధాన అభియోగమని చెప్పారు. చందానగర్‌ పీఎస్‌లోని కేసును కొట్టేయడంతో గచ్చిబౌలిలో మరో ఫిర్యాదు చేశారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *